Marripudi: మర్రిపూడి మండలంలో విద్యుత్ కంచె బలైయిన బాలుడు!
Marripudi: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపేటలో విషాదం. పొలం చుట్టూ విద్యుత్ కంచె తాకి బాలుడు, కుక్క మృతి. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు.
Marripudi: మర్రిపూడి మండలంలో విద్యుత్ కంచె బలైయిన బాలుడు!
Marripudi: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని గార్లపేట గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు తన పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు విద్యుత్ సరఫరా అవుతుండటంతో ఓ తొమ్మిదేళ్ల బాలుడు, ఓ కుక్క ప్రాణాలు కోల్పోయాయి.
గ్రామానికి చెందిన దేవిరెడ్డి నవీన్ (9) మరో చిన్నారితో కలిసి ఒక కుక్కను వెంటబెట్టుకుని గ్రామ శివారులోని బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెను కుక్క తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయింది. కుక్కను కాపాడే ప్రయత్నంలో నవీన్ దానిని పట్టుకోవడంతో బాలుడికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. తీవ్ర విద్యుత్ ఘాతానికి గురైన నవీన్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని చికిత్స నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కళ్లముందే ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గార్లపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
పొలం చుట్టూ ప్రాణాంతకంగా విద్యుత్ కంచె ఏర్పాటు చేసి బాలుడి మృతికి కారణమైన రైతుపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రమాదకర విద్యుత్ కంచెలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




