Podili: కాటూరివారిపాలెంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు!

Podili: పొదిలి ప్రాజెక్టు పరిధిలోని కాటూరివారిపాలెంలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాలను సీడీపీఓ సుధా మారుతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

MADARVALI, MARKAPURAM
Published on: 7 Oct 2026 6:47 PM IST
Podili
X

Podili: కాటూరివారిపాలెంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు!

Podili: పొదిలి ప్రాజెక్టు పరిధిలోని కాటూరివారిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ సుధా మారుతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తల్లులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీడీపీఓ సుధా మారుతి మాట్లాడుతూ గర్భధారణ నుంచి శిశువు జీవితంలోని తొలి 1000 రోజులు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఈ కాలంలో తల్లులు, చిన్నారులకు తగిన పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు.

పిల్లల ఎదుగుదల, శారీరక–మానసిక వికాసానికి సమతుల్యమైన పోషకాహారం ఎంతో అవసరమని సీడీపీఓ వివరించారు. పోషకాహార లోపం వల్ల కలిగే సమస్యలపై తల్లులకు అవగాహన కల్పించారు. స్థానికంగా లభించే పౌష్టికాహార పదార్థాలను పిల్లలకు అందించాలని సూచించారు.

అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ద్వారా అర్హులైన గర్భిణులు, బాలింతలు పొందుతున్న ప్రయోజనాలను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పోషణ మాసోత్సవాల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రంలో తల్లులు, పిల్లలకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలు సరస్వతి, సునీత, హెల్పర్లు, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలను అభినందిస్తూ సీడీపీఓ సుధా మారుతి వారిని సత్కరించారు.

కార్యక్రమంలో సీడీపీఓ సుధా మారుతి, సూపర్‌వైజర్ ప్రసన్న, అంగన్‌వాడీ కార్యకర్తలు సరస్వతి, సునీత, హెల్పర్లు, ఆశా కార్యకర్తలు, తల్లులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM