Ongole: చలో ఒంగోలు మహా ధర్నాకు షరతులతో అనుమతి
Ongole: కౌశిక్, మౌలాబీల మరణాలకు కారణమైన స్కూల్ యాజమాన్యం అరెస్ట్‌ను కోరుతూ ఈ నెల 12న నిర్వహించనున్న చలో ఒంగోలు ధర్నాకు ఎస్పీ షరతులతో అనుమతినిచ్చారు.
Ongole: చలో ఒంగోలు మహా ధర్నాకు షరతులతో అనుమతి
ఒంగోలు: ఒంగోలులో ఈ నెల 12న నిర్వహించ తలపెట్టిన చలో ఒంగోలు మహా ధర్నాకు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు షరతులతో కూడిన మౌఖిక అనుమతి ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సారథ్యంలో, కౌశిక్ మౌలాబీల మరణాలకు కారణమైన శ్రీ చైతన్య నవోదయ స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నాకు పిలుపునిచ్చారు.
తొలుత ధర్నాకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. అయితే, అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సైదా నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరారు.
దీంతో 500 మందితో ధర్నా నిర్వహించేందుకు ఎస్పీ మౌఖికంగా అనుమతి ఇచ్చారు. 500 మందికి మించి జనాన్ని తరలించవద్దని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సైదా, సీపీఐ(ఎంఎల్) నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ, సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పసుమర్తి సుధాకర్, లోక్‌సత్తా నాయకుడు ఎస్. చంద్రశేఖర్, ముస్లిం మైనార్టీ సంఘాల అధ్యక్షుడు షేక్ రఫీ, యువజన నాయకులు కృష్ణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.




