Chirala: చీరాలలో వినాయక ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు!

Chirala; చీరాల రూరల్ సర్కిల్ పరిధిలో వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి అని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన సీఐ సుధాకర్.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 12 Sept 2026 8:23 AM IST
Chirala
X

Chirala: చీరాలలో వినాయక ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు!

Chirala: వినాయక చవితి సందర్భంగా చీరాల రూరల్ సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహ మండపాలను ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని చీరాల రూరల్ సర్కిల్ సీఐ. సుధాకర్ సూచించారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

వినాయక విగ్రహాలతో మండపాలను ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా కమిటీగా ఏర్పడి ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ganeshutsav.net ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

మండపాల ఏర్పాటుకు విద్యుత్ శాఖ, పోలీస్ శాఖతో పాటు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా పొందాలని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్‌కు ఎలాంటి అనుమతులు లేవని సీఐ సుధాకర్ స్పష్టం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్‌ను అద్దెకు ఇచ్చే సప్లయర్లు, వాటిని వినియోగించే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వినాయక మండపాల వద్ద రాత్రి వేళల్లో కనీసం ఒకరు కాపలాగా ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భద్రతను మరింత పటిష్టం చేసుకోవచ్చన్నారు.

నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉండాలి

చీరాల రూరల్ సర్కిల్ పరిధిలోని వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌లలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు, భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సూచించారు.

సముద్రంలో నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. వినాయక చవితి వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ సుధాకర్ హెచ్చరించారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala