Markapuram: రేపు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్!
Markapuram: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ కెనాల్ పనుల పరిశీలనతో పాటు సంజీవిని ఆసుపత్రిని ప్రారంభిస్తారు.
Markapuram: రేపు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్!
మార్కాపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం మార్కాపురం జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
అనంతరం గిద్దలూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన సంజీవిని ఆసుపత్రిని ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను జిల్లా అధికారులు విడుదల చేశారు.
షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 9:55 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరే ముఖ్యమంత్రి, ఉదయం 10:45 గంటలకు మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం పరిధిలోని గంటవానిపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో స్వల్ప సమావేశం అనంతరం ఉదయం 11 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేయడంతో పాటు, ఫీడర్ కెనాల్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, పెండింగ్ అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 12:20 గంటల వరకు నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలు, వినతులను స్వీకరించి తగిన చర్యలపై అధికారులకు సూచనలు చేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 12:35 గంటలకు దోర్నాల నుంచి బయలుదేరి, 12:55 గంటలకు గిద్దలూరు నియోజకవర్గంలోని కిష్టంశెట్టిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన సంజీవిని ఆసుపత్రిని ప్రారంభించి, వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో సమావేశమవుతారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత గ్రామంలో నిర్వహించే గార్డెన్ మీటింగ్‌లో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశమై అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.
పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 5:15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో గుంటూరుకు బయలుదేరనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సాయుధ బలగాలను మోహరించారు. పర్యటన సజావుగా, భద్రంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు.




