Markapuram: మార్కాపురంలో ‘వన్ మంత్.. వన్ విలేజ్’ షురూ!
Markapuram: మార్కాపురం జిల్లాలో రేపటి నుంచి ‘వన్ మంత్ – వన్ విలేజ్’ కార్యక్రమం ప్రారంభం.
Markapuram: మార్కాపురంలో ‘వన్ మంత్.. వన్ విలేజ్’ షురూ!
Markapuram: మార్కాపురం జిల్లాలో ప్రజల రెవెన్యూ సమస్యలను గ్రామ స్థాయిలోనే వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ONE MONTH – ONE VILLAGE – FOUR VISITS” కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో ప్రతి నెల ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ గ్రామంలో వరుసగా నాలుగు వారాల పాటు నాలుగు విడతలుగా ప్రత్యేక రెవెన్యూ గ్రామ సందర్శనలు నిర్వహించబడతాయి. గ్రామస్థుల భూ, రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామంలోనే స్వీకరించి, పరిశీలించి, చట్టబద్ధంగా పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రత్యేకంగా రీ-సర్వే గ్రామాలు, ఎక్కువ సంఖ్యలో పెండింగ్ రెవెన్యూ ఫిర్యాదులు ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితర అధికారులు తప్పనిసరిగా పాల్గొంటారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా:
• మొదటి సందర్శనలో ఫిర్యాదుల స్వీకరణ, గ్రామ భూ రికార్డుల పరిశీలన,
• రెండవ సందర్శనలో ఫీల్డ్ వెరిఫికేషన్ మరియు విచారణ,
• మూడవ సందర్శనలో సమస్యల పరిష్కారం మరియు ఉత్తర్వుల జారీ,
• నాల్గవ సందర్శనలో గ్రామ సభ నిర్వహించి పరిష్కరించిన సమస్యల వివరాల ప్రజాప్రకటన చేపడతారని తెలిపారు.
భూ సరిహద్దు వివాదాలు, మార్పిడి (Mutation) సమస్యలు, కుటుంబ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రీ-సర్వే సమస్యలు, 22-A నిషేధిత ఆస్తుల అంశాలు, దారుల వివాదాలు తదితర రెవెన్యూ సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలను “రెవెన్యూ ఫిర్యాదుల రహిత గ్రామాలుగా” తీర్చిదిద్దడం, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడం, పెండింగ్ ఫిర్యాదులను తగ్గించడం మరియు ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
జిల్లాలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ రెవెన్యూ సమస్యలను సంబంధిత గ్రామ సందర్శనల సమయంలో అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి (గురువారం ) మార్కాపురం జిల్లాలో మొదవుతుంది. ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున ప్రారంభమవుతుంది అని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు.




