Dornala: ఎన్నికల సిబ్బందికి ఆర్‌ఓ వేణుగోపాలరావు కీలక సూచనలు

Dornala: పెద్ద దోర్నాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, సామగ్రి పంపిణీ. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్‌ఓ వేణుగోపాలరావు సూచన.

Srikanth Singam, Markapur
Published on: 4 Nov 2026 4:47 PM IST
Dornala
X

Dornala: ఎన్నికల సిబ్బందికి ఆర్‌ఓ వేణుగోపాలరావు కీలక సూచనలు

దోర్నాల: మార్కాపురం జిల్లా, పెద్ద దోర్నాల మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సిబ్బందిని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి వేణుగోపాలరావు ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఎన్నికల విధుల కోసం సిబ్బందికి బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు తదితర ఎన్నికల సామగ్రిని అందజేశారు. ఎన్నికల సామగ్రిని అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని, నీరు తగలకుండా, సిరా మరకలు పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల నిర్వహణలో రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉండకుండా, ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

ముఖ్యంగా ఓటరు బ్యాలెట్ పత్రంపై ఓటు వేసిన అనంతరం దానిని ఏ విధంగా మడత పెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాలనే విషయంపై ఓటర్లకు స్పష్టంగా వివరించాలని సిబ్బందికి సూచించారు. ఓటు వేసే విధానం, బ్యాలెట్ పత్రాన్ని మడత పెట్టే పద్ధతిపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని వేణుగోపాలరావు సూచించారు. ఎన్నికల నిర్వహణకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur