Chirala: పర్యావరణ పరిరక్షణకు '3R' సూత్రం కీలకం: ఆవల వెంకటేశ్వర్లు!

Chirala: చీరాలలో సెయింట్ ఆన్స్ కాలేజీలో అంతర్జాతీయ ఈ-వేస్ట్ దినోత్సవం; ఈ-వ్యర్థాల నియంత్రణకు '3R' సూత్రం పాటించాలని నిపుణుల పిలుపు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 15 Oct 2026 10:53 PM IST
Chirala
X

Chirala: పర్యావరణ పరిరక్షణకు '3R' సూత్రం కీలకం: ఆవల వెంకటేశ్వర్లు!

Chirala: చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ ఈ-వ్యర్థాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాలలోని క్లైమేట్ యాక్షన్ యూనిట్ (సీఏ యూ), యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ సెల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన భావపురి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపాల్, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు ఈ-వ్యర్థాల వల్ల కలిగే పర్యావరణ నష్టాలను వివరించారు. పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నిర్లక్ష్యంగా పారవేయడం వల్ల నేల, నీరు, గాలి కలుషితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ వ్యర్థాలను సాధారణ చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి, అధీకృత రీసైక్లింగ్ కేంద్రాలకు అందించాలని సూచించారు. ఈ-వ్యర్థాల నిర్వహణలో 3ఆర్ సూత్రం (రెడ్యూస్ రీ యూస్ ,రెసైకిల్ ) ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం, ఉపయోగించగల పరికరాలను తిరిగి వినియోగించడం, పనికిరాని పరికరాలను శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు. విద్యార్థులు తమ ఇళ్లలో, కళాశాలలో ఈ-వ్యర్థాల సక్రమ నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

కళాశాల డైరెక్టర్ (ఆర్‌ అండ్‌ డీ, అక్రిడిటేషన్) డాక్టర్ సి.ఎస్. రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ బాబు కార్యక్రమాన్ని అభినందిస్తూ, పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ-వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, సురక్షిత పారవేతపై అవగాహన పొందారు.

కార్యక్రమానికి క్లైమేట్ యాక్షన్ యూనిట్ కన్వీనర్ డాక్టర్ జి. విజయకుమార్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ సెల్ కన్వీనర్ డాక్టర్ కె. కిరణ్ కుమార్ సమన్వయం వహించారు. కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణ, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) దొర నాగసాయి ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ-వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala