Podili: పొదిలిలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహణ!
Podili: ప్రకాశం జిల్లా పొదిలిలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం.. వర్షాభావ వేళ వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారి సూచన.
Podili: పొదిలిలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహణ!
Podili: ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి వంటి నీటి ఆధారిత పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలని మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం పొదిలి మండలంలోని తలమళ్ల, ఉప్పలపాడు గ్రామాల్లో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకుని కంది, మినుము, అలసంద వంటి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కంది పంటకు బీమా చేసుకున్న రైతులు, బీమా నిబంధనలకు అనుగుణంగా తమకు నిర్దేశించిన సర్వే నంబర్లలోనే కంది పంటను సాగు చేయాలని తెలిపారు.
రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలను ఇకపై APAIMS 2.0 యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం సంభవించినప్పుడు పరిహారం పొందడానికి, పంటల బీమా వర్తించడానికి, అలాగే ప్రభుత్వ మద్దతు ధరకు ఉత్పత్తులను విక్రయించడానికి ఈ-పంట నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకాల ఆర్థిక సాయం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాలన్నా, ఎరువుల కొనుగోలు సజావుగా సాగాలన్నా రైతులకు ప్రత్యేక గుర్తింపు అవసరమని తెలిపారు.
ఇందుకోసం రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ యాప్ ద్వారా సమీపంలోని రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి, తమకు కేటాయించే 11 అంకెల రైతు విశిష్ట నంబర్‌ను వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ నాయకులు, సచివాలయ సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.




