Markapuram: రాచర్ల కేజీబీవీలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తనిఖీ!

Markapuram: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, వసతులు మరియు భోజన నాణ్యతను పరిశీలించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 18 July 2026 11:04 PM IST
Markapuram
X

Markapuram: రాచర్ల కేజీబీవీలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తనిఖీ

మార్కాపురం: స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి రాచర్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థినులకు కల్పిస్తున్న వసతి,భోజన సౌకర్యాలు, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, భోజనం నాణ్యత, పరిమాణం, మెనూ అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈరోజు మెనూ ప్రకారం పాయసం అందించాల్సి ఉన్నప్పటికీ విద్యార్థినులకు అందించకపోవడంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన, తగిన పరిమాణంలో భోజనం అందించాలని స్పష్టం చేశారు.పాఠశాలలోని మరుగుదొడ్లు, స్నానాల గదులను పరిశీలించిన ఎమ్మెల్యే వాటి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

తరగతి గదుల్లో సరిపడా వెలుతురు లేకపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే, అవసరమైన చోట అదనపు లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే పనిచేయని ఫ్యాన్లను వెంటనే మరమ్మతులు చేయించి విద్యార్థినులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు.

అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థినుల హాజరును తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బందితో సమావేశమై విద్యాబోధన నాణ్యత, విద్యార్థినుల సంక్షేమం, పాఠశాల పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు.

పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాచర్ల మండల పార్టీ అధ్యక్షులు కటిక యోగానంద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, నల్లబోతుల శ్రీను, సంజీవ్ , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story