Giddalur: గిద్దలూరులో ఘనంగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

Giddalur: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గిద్దలూరు విశ్వభారతి పాఠశాలలో ఆరు మండలాల ఉత్తమ ఉపాధ్యాయులకు ‘గురుబ్రహ్మ’ పురస్కారాలు అందజేసి సత్కరించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 5 Oct 2026 9:28 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో ఘనంగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

మార్కాపురం జిల్లా, గిద్దలూరు: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక విశ్వభారతి ప్రైవేటు పాఠశాలలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం నిర్వహించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బీఎస్ నారాయణ్ రెడ్డి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల సభ్యులు, విశ్వభారతి పాఠశాల యాజమాన్యం సహకారంతో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల ఎదుగుదలే లక్ష్యంగా భావి పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల కృషిని కొనియాడుతూ, ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు ‘గురుబ్రహ్మ’ పురస్కారాలు అందజేశారు.

నారాయణ్ రెడ్డి మాట్లాడుతూ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. మరుగున పడిన స్వాతంత్ర్యోద్యమ వీరుల చరిత్రను వీరగాథల రూపంలో పరిచయం చేసి, దేశభక్తిని పెంపొందించాలని కోరారు.

ముఖ్య అతిథిగా హాజరైన గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ పి. రమణ బాబు మాట్లాడుతూ, అన్ని వృత్తులకు పునాది వేసేది గురువేనని పేర్కొన్నారు. ప్రతి పురస్కారం, ప్రతి సత్కారం బాధ్యతను మరింత గుర్తుచేస్తాయని, ఆ స్ఫూర్తితో ఉపాధ్యాయులు ముందుకు సాగాలని సూచించారు.

విశ్వభారతి పాఠశాల కరస్పాండెంట్ రంగస్వామి రెడ్డి మాట్లాడుతూ, “ఇంతటి బృహత్తర కార్యక్రమానికి మా పాఠశాల ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాము. గురువుల అనుభవాలు, సేవాస్ఫూర్తి మా ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నాము.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి, వివిధ మండలాల విద్యాశాఖాధికారులు, విశ్రాంత ఉపాధ్యాయులు, మానవతా సేవా సంస్థ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU