Guntakal: హాస్టల్ విద్యార్థుల సమస్యలపై సెప్టెంబర్ 10 నుంచి AISF బస్సు యాత్ర
Guntakal: గుంతకల్లులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10 నుండి 25 వరకు హాస్టళ్ల సందర్శన కార్యక్రమ కరపత్రాలు విడుదల.
Guntakal: హాస్టల్ విద్యార్థుల సమస్యలపై సెప్టెంబర్ 10 నుంచి AISF బస్సు యాత్ర
గుంతకల్లు: హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా హాస్టళ్ల సందర్శన చేపట్టనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ తెలిపారు.
గుంతకల్లు ఎస్.కె.పి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు స్వేంతన్ అధ్యక్షతన జరిగిన పట్టణ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హాస్టళ్ల సందర్శన కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వెంకట్ నాయక్ మాట్లాడుతూ.. "జైల్లో ఉండే ఖైదీలపై ఉన్న ప్రేమ కూడా హాస్టల్ విద్యార్థులపై ప్రభుత్వానికి లేదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ముద్దుల కొడుకు నారా దేవాన్ష్ కు ఇచ్చే ప్రోటీన్ ఫుడ్ ను హాస్టల్ విద్యార్థులకు అందించాలి" అని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల హాస్టళ్లలో పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి రూ.3,000 మెస్ చార్జీలు ఇవ్వాలని కోరారు. చాలా హాస్టల్ భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, వాటికి సొంత భవనాలు కేటాయించాలని, పేద విద్యార్థులకు అనుగుణంగా కొత్త హాస్టళ్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి హాస్టల్ లో కాంపౌండ్ వాల్ నిర్మించాలని, నాణ్యమైన ఆహారం, సరిపడా స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, వార్డెన్, కుక్, అటెండర్, కామాటి, వాచ్ మెన్ పోస్టులను భర్తీ చేసి రెగ్యులర్ సిబ్బందికి ప్రతి నెలా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు పావని, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు స్వేంతన్, షాహిర్, కోశాధికారి యస్వంత్, డిగ్రీ కళాశాల సహాయ కార్యదర్శి దివ్య, నాయకులు భరత్, మహేష్, రాజశేఖర్, పురుషోత్తం, ప్రవీణ్, తరుణ్, వంశీ, రఫీ తదితరులు పాల్గొన్నారు.




