Markapuram: మార్కాపురంలో భారీ ట్రాఫిక్ జామ్.. నరకం చూసిన జనం!
Markapuram: మార్కాపురం ఎన్ఎస్ నగర్‌లో మున్సిపాలిటీ చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం వల్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Markapuram: మార్కాపురంలో భారీ ట్రాఫిక్ జామ్.. నరకం చూసిన జనం!
మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ నగర్‌లో శనివారం ఉదయం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం కోసం కొండేపల్లి ప్రధాన రహదారిలోని పోలీస్ క్వార్టర్స్ సమీపంలో రాకపోకలను నిలిపివేయడంతో భారీ ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
ఉదయం 8 గంటల సమయంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, స్కూల్ బస్సులు, ఉద్యోగాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులను సమయానికి పాఠశాలలకు చేర్చేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆందోళన చెందారు.
మరోవైపు రాత్రి కురిసిన వర్షంతో అంతర్గత రహదారులు బురదమయంగా మారడంతో, దారి మళ్లించిన వాహనాలు పలుచోట్ల ఇరుక్కుపోయాయి. దీంతో ప్రజలు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం మంచిదేనని, అయితే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. కొంతసేపు కొండేపల్లి రోడ్డు అమీర్‌పేట్ జంక్షన్‌ను తలపించేలా ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయింది.




