Podili: ఉద్రిక్తతల మధ్య పొదిలి బాప్టిస్ట్ పాలెం విద్యాకమిటీ ఎన్నిక వాయిదా
Podili: ప్రకాశం జిల్లా పొదిలి బాప్టిస్ట్ పాలెం విద్యాకమిటీ ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తతల నడుమ ఎన్నికల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది.
Podili: ఉద్రిక్తతల మధ్య పొదిలి బాప్టిస్ట్ పాలెం విద్యాకమిటీ ఎన్నిక వాయిదా
పొదిలి: సార్వత్రిక ఎన్నికలను తలపించేలా సాగుతున్న పొదిలి బాప్టిస్ట్ పాలెం విద్యాకమిటీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండుసార్లు ఎన్నిక వాయిదా పడటంతో విద్యాకమిటీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
గతంలో తొలిసారి ఎన్నిక నిర్వహించిన సమయంలో అవసరమైన కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. తాజాగా శుక్రవారం నిర్వహించిన ఎన్నికకు కోరం ఉన్నప్పటికీ, ఓటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే కొంతమంది ఓటర్లు బయటకు వెళ్లిపోయారని, వారు మధ్యాహ్నం 12.30 గంటల వరకు తిరిగి రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగలేదని అధికారులు తెలిపారు. దీంతో ఎన్నికను మరోసారి వాయిదా వేసినట్లు సమాచారం.
విద్యాకమిటీ ఎన్నికలకు రాజకీయ రంగు పులుముకుంటోందని కొందరు అభిప్రాయపడుతుండగా, అధికారపార్టీ తమ పట్టు కొనసాగించేందుకే ఎన్నికను వాయిదా వేయిస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల నిర్వహణ అధికారుల పరిధిలోని అంశమని, ఇందులో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకునే అవకాశం లేదని మరో వర్గం పేర్కొంటోంది.
ఏదేమైనా విద్యాసంస్థలకు సంబంధించిన కమిటీ ఎన్నికల్లో రాజకీయ ప్రభావం కనిపిస్తుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకుని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.




