Markapuram: మార్కాపురం, ప్రకాశంలో నామినేషన్ల రగడ.. లాఠీఛార్జ్
Markapuram: ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో స్థానిక సంస్థల నామినేషన్ల వేళ ఉద్రిక్తతలు చెలరేగాయి. పుల్లలచెరువులో లాఠీఛార్జ్ జరగ్గా, పలుచోట్ల పత్రాల చించివేత ఆరోపణలు వెల్లువెత్తాయి.
Markapuram: మార్కాపురం, ప్రకాశంలో నామినేషన్ల రగడ.. లాఠీఛార్జ్
మార్కాపురం / ప్రకాశం జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు, ఉపసంహరణల ప్రక్రియ నేపథ్యంలో మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పుల్లలచెరువు, పీసీ పల్లి, సింగరాయకొండ, అద్దంకి, దర్శి ప్రాంతాలతో పాటు ఒంగోలు కార్పొరేషన్లోనూ నామినేషన్ల వ్యవహారం రాజకీయ రగడకు దారితీసింది. పలుచోట్ల వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకోగా, పుల్లలచెరువులో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
పుల్లలచెరువులో ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తుండగా, అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం మండల కేంద్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గిద్దలూరులో కృష్ణ కిషోర్ రెడ్డి నామినేషన్ల ఉపసంహరణ
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి తన మూడు నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పీసీ పల్లిలో నామినేషన్ పత్రాలు లాక్కున్నారంటూ ఆరోపణలు
మార్కాపురం జిల్లా పీసీ పల్లి మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన సమయంలో ఎంపీపీ అభ్యర్థి వరలక్ష్మి వద్ద నుంచి టీడీపీ వర్గీయులు నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కెళ్లినట్లు వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. దీనికి నిరసనగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు నామినేషన్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
సింగరాయకొండలో నామినేషన్ పత్రాలు చించివేశారంటూ ఆరోపణలు
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని టీడీపీ నాయకులు అడ్డుకుని, నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సింగరాయకొండ ఎంపీటీసీ ఐదో స్థానం, పాకల ఎంపీటీసీ రెండో స్థానం అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
అద్దంకిలో స్వల్ప ఉద్రిక్తత
ప్రకాశం జిల్లా అద్దంకి బాలికల ఉన్నత పాఠశాల వద్ద వార్డు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థులపై బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం రహదారిపై బందోబస్తు ఏర్పాటు చేశారు.
దర్శి నియోజకవర్గంలో టెన్షన్
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒంగోలు 25వ డివిజన్లో గందరగోళం
ఒంగోలు కార్పొరేషన్లోని 25వ డివిజన్లో నామినేషన్ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను చింపివేశారని, టీడీపీ అభ్యర్థితో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ వైసీపీ నామినేషన్ను పరిగణనలోకి రాకుండా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, వైసీపీ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు సమాచారం. ఇదే డివిజన్లో మరో వైసీపీ అభ్యర్థిని టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపించడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల నామినేషన్ల దాఖలు, ఉపసంహరణల ప్రక్రియ వివాదాస్పదంగా మారడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, బలవంతపు ఉపసంహరణలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నాయి. మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పలుచోట్ల బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించి ఆరోపణలపై అధికారుల స్పందన, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.




