Giddalur: చిక్కుడు రైతులకు ఎల్-నినో పరిస్థితులపై ఉద్యానశాఖ అవగాహన!
Giddalur: ఉద్యానశాఖ ఆధ్వర్యంలో చిక్కుడు రైతులకు ఎల్-నినో వాతావరణ పరిస్థితులపై అవగాహన సదస్సు నిర్వహించి, పంట సంరక్షణపై హెచ్.ఓ శ్వేత మార్గదర్శకాలు చేశారు.
Giddalur: చిక్కుడు రైతులకు ఎల్-నినో పరిస్థితులపై ఉద్యానశాఖ అవగాహన!
గిద్దలూరు: గిద్దలూరు మండలంలో చిక్కుడు రైతులకు ఎల్-నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది.మండలంలోని ఉప్పలపాడు మరియు వెంకటాపురం గ్రామాలలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో చిక్కుడు (Dolichos Bean) పంటలో ఎల్-నినో ప్రభావాన్ని తగ్గించి అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు పాటించాల్సిన ముందస్తు చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఉద్యానశాఖ అధికారి శ్వేత రైతులతో ప్రత్యక్షంగా సమావేశమై, ఎల్-నినో పరిస్థితుల వల్ల ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, నేలలో తేమ కొరత, పుష్పాలు రాలిపోవడం, కాయల ఏర్పాటు తగ్గడం వంటి సమస్యలను అధిగమించేందుకు అనుసరించాల్సిన శాస్త్రీయ సాగు పద్ధతులను వివరించారు.
చిక్కుడు పంటలో ఎల్-నినో పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యేక సూచనలు:
మొక్కల అడుగుభాగంలో సేంద్రియ మల్చింగ్ (గడ్డి, ఎండిన ఆకులు మొదలైనవి) చేయడం ద్వారా నేలలో తేమను కాపాడాలి.
డ్రిప్ ద్వారా తక్కువ మోతాదులో తరచుగా నీరు అందించాలి.
పుష్పించే దశలో 1% పొటాషియం నైట్రేట్ (KNO₃) లేదా 2% DAP + 1% MOP ఆకుస్ప్రేలను అవసరాన్ని బట్టి వినియోగించాలి.
కాల్షియం, బోరాన్ మరియు సూక్ష్మపోషకాల స్ప్రేలు అవసరమైన దశలో ఇవ్వాలి.
అధిక ఉష్ణోగ్రతల వల్ల పూలు రాలిపోకుండా ఉండేందుకు 3% కయోలిన్ స్ప్రే వినియోగించవచ్చని సూచించారు.
తామర పురుగులు, తెల్లదోమలు, పేనుబంకలు, మైట్స్ వంటి రసం పీల్చే పురుగులను ప్రారంభ దశలోనే సమగ్ర సస్యరక్షణాపడతులు (IPM) ద్వారా నియంత్రించాలని సూచించారు.
వైరస్ వ్యాధులు రాకుండా ఉండేందుకు వ్యాధి వాహక పురుగుల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు.
ఈ సందర్భంగా రైతులకు ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు పాటించాల్సిన ముఖ్యమైన ముందస్తు చర్యలను వివరించారు.
1. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS)
వర్షాలు ప్రారంభానికి ముందే తగిన నేల తేమ ఉన్న సమయంలో విత్తనాలు విత్తడం ద్వారా తొలి వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.
దీని వల్ల మొలక శాతం పెరగడంతో పాటు పంట ప్రారంభ దశలో తేమ కొరత ప్రభావం తగ్గుతుందని వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న PMDS పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
2. ఫార్మ్ పాండ్లు
వర్షపు నీటిని ఫార్మ్ పాండ్లలో నిల్వ చేసుకోవడం ద్వారా అవసరమైన సమయంలో ప్రాణాధార నీటిపారుదల అందించవచ్చని తెలిపారు.
కమ్యూనిటీ మరియు వ్యక్తిగత ఫార్మ్ పాండ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలని సూచించారు.
3. మైక్రో ఇరిగేషన్ (డ్రిప్)
డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రతి నీటి బొట్టు సమర్థవంతంగా మొక్కలకు అందుతుందని వివరించారు.
నేలలో తేమ ఎక్కువకాలం నిలిచి పంట ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు.
4. పంటల బీమా
ప్రకృతి వైపరీత్యాలు, కరువు, ఎల్-నినో వంటి పరిస్థితుల వల్ల పంట నష్టం సంభవించినప్పుడు రైతులకు ఆర్థిక భరోసా కల్పించే పంటల బీమా పథకాలలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
5. వీడ్ మ్యాట్ (Weed Mat)
కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టడంతో పాటు నేలలో తేమను ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి వీడ్ మ్యాట్ ఎంతో ఉపయోగకరమని వివరించారు.
దీని ద్వారా నీటి ఆదా, కలుపు నివారణ ఖర్చు తగ్గడంతో పాటు పంట ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో గ్రామ ఉద్యాన సహాయకులు కిరణ్మయి, గ్రామ వ్యవసాయ సహాయకులు వెంకటేశ్, ఐసీఆర్పీ కల్యాణి మరియు రైతులు పాల్గొన్నారు.




