Kanigiri: కనిగిరిలో సీపీఎం అభ్యర్థిపై దాడి.. ఉద్రిక్తత

Kanigiri: కనిగిరి మున్సిపాలిటీ 29వ వార్డు సీపీఎం అభ్యర్థి పి. నరేంద్రపై దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారని ఆరోపిస్తూ సీపీఎం శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి.

Guravayya, Kanigiri
Published on: 19 Oct 2026 8:41 PM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరిలో సీపీఎం అభ్యర్థిపై దాడి.. ఉద్రిక్తత

మార్కాపురం జిల్లా, కనిగిరి: కనిగిరి మున్సిపాలిటీలోని 29వ వార్డు సీపీఎం అభ్యర్థి పి. నరేంద్రపై దాడి చేసి, నామినేషన్ పరిశీలనకు సంబంధించిన పత్రాలను బలవంతంగా లాక్కెళ్లారని ఆరోపిస్తూ సీపీఎం శ్రేణులు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో నామినేషన్ పత్రాల పరిశీలనకు హాజరయ్యేందుకు అభ్యర్థి పి. నరేంద్ర, సీపీఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పి.సి. కేశవరావుతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో గుమిగూడిన టీడీపీ నాయకులు నరేంద్రను పరిశీలన హాలులోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, ఆయన చేతిలోని నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కెళ్లారని సీపీఎం నాయకులు ఆరోపించారు. పట్టణ కార్యదర్శి పి.సి. కేశవరావుపై దాడి చేసి కార్యాలయం నుంచి బయటకు నెట్టివేశారని తెలిపారు.

ఈ ఘటనపై సీపీఎం మార్కాపురం జిల్లా కమిటీ సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, 29వ వార్డు అభ్యర్థి నరేంద్రకు పోలీసు రక్షణ కల్పించి ఎన్నికల ప్రక్రియలో స్వేచ్ఛగా పాల్గొనేలా చూడాలని కోరింది.

ఈ ఘటనకు నిరసనగా సాయంత్రం కనిగిరి పట్టణంలో సీపీఎం శ్రేణులు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నాయి. అక్కడ ఎన్నికల అధికారిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాయి. సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి హామీ ఇచ్చినట్లు సీపీఎం నాయకులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం డీఎస్పీని కలిసి వివరించాలని అధికారి సూచించినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కెళ్లడం ప్రజాస్వామ్య హక్కులకు విఘాతమని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగి, చెన్నకేశవులు, నాగరాజు, శ్రీనివాసులు, ధర్మయ్య, చంటి, జేమ్స్, హజరత్, వెంకటమ్మ, శాంతకుమారి, రత్తమ్మ, ఆదిలక్ష్మి, రుఫియా, రమణమ్మ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri