Markapuram: మార్కాపురం జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజల్లో అవగాహన పెరగాలి

Markapuram: ఆర్థిక అక్షరాస్యత సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) షేక్ షాహిర్ కౌన్సిలర్లను ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 18 Jun 2026 3:08 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజల్లో అవగాహన పెరగాలి

మార్కాపురం: జిల్లాలో ప్రజలు ఆర్థిక వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ప్రస్తుత కాలంలో ఎంతో అవసరమని మార్కాపురం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) షేక్ షాహిర్ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ (సీఎఫ్‌ఎల్) ప్రాజెక్టు అమలు తీరును సమీక్షించే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు ఎల్‌డీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం షేక్ షాహిర్ జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కంభం, పొదిలి, కనిగిరి, పీసీ పల్లి ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను సందర్శించి అక్కడి కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎఫ్‌ఎల్ ప్రాజెక్టు పురోగతిని పరిశీలించి, గ్రామీణ ప్రజలకు ఆర్థిక విద్యను మరింత చేరువ చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు బ్యాంకింగ్ సేవల వినియోగం, పొదుపు అలవాట్లు, బీమా పథకాల ప్రాధాన్యం, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని కౌన్సిలర్లను ఆదేశించారు. ముఖ్యంగా బ్యాంకుల్లో సంవత్సరాలుగా క్లెయిమ్ చేయకుండా ఉన్న డిపాజిట్ల గురించి ప్రజలకు తెలియజేసి వాటిని తిరిగి పొందే విధానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోకూడదని ప్రజలకు తెలియజేయడంతో పాటు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండేలా చైతన్యం కల్పించాలని పేర్కొన్నారు.

సీఎఫ్‌ఎల్ ప్రాజెక్టును జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్న సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (ఎస్‌ఎస్‌టీ) ప్రాజెక్టు మేనేజర్ వి. ఆంజనేయులు, ప్రాజెక్టు డైరెక్టర్ వి. అశోక్‌ల సేవలను ఆయన అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంలో వారి బృందం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌టీ రాష్ట్ర కోఆర్డినేటర్ కె. అశోక్, ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ బి. శ్రీను, కంభం సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్లు పందిటి అశోక్ కుమార్, డోలు ఉదయ్‌తో పాటు జిల్లాలోని పలువురు సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story