Markapur: మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డి ప్రమాణం
Markapur: మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డి, వైస్ చైర్మన్‌గా జీవీ శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేశారు; ప్రముఖుల హాజరు, అభివృద్ధి హామీ.
Markapur: మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డి ప్రమాణం
మార్కాపూర్: మార్కాపురం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం సాగించిన కందుల రామిరెడ్డి, కార్యకర్త స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయికి ఎదిగి తన 30 ఏళ్ల రాజకీయ శ్రమకు ఫలితం దక్కించుకున్నారు. మార్కాపురం జిల్లా తొలి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన శుక్రవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
మార్కాపురం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత కందుల రామిరెడ్డితో జడ్పీ చైర్మన్‌గా ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా జీవీ శ్రీనివాస వర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. నూతన జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు జడ్పీటీసీ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు సహకారంతో మార్కాపురం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ తన బాధ్యతలను నిర్వర్తిస్తానని కందులు రామిరెడ్డి స్పష్టం చేశారు.కార్యకర్తగా మొదలైన ప్రస్థానం.. మూడు దశాబ్దాల నిరీక్షణ.. నేడు జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు.. కందుల రామిరెడ్డి రాజకీయ ప్రయాణంలో ఇదొక కీలక మైలురాయి.




