Markapur: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
Markapur: మార్కాపురంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై అఖిలపక్ష సమావేశం. జిల్లాలో 990 పోలింగ్ కేంద్రాలు, 7,55,731 ఓటర్లు ఉన్నట్లు వెల్లడించిన అధికారులు.
Markapur: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
మార్కాపూర్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల లొకేషన్లు, ఓటర్ల కేటాయింపు, పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం మార్కాపురం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చర్చించారు. ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓటర్లను ఆయా కేంద్రాలకు కేటాయించే విధానం, ఓటర్లకు అవసరమైన సౌకర్యాలపై సమావేశంలో చర్చించారు.
పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు తదితర మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీ స్థానాల పరిధిలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపైనా చర్చించారు. ఆయా గ్రామాల ప్రస్తుత పరిస్థితులు, ఓటర్లకు అందుబాటులో ఉండే ప్రదేశాలను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తాజా ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులను కోరారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులను నిబంధనల ప్రకారం పరిశీలించి, తాజా జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
మార్కాపురం జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 990 పోలింగ్ కేంద్రాలు, 7,55,731 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, నిబంధనలను పాటించి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
సమావేశంలో డీఎల్‌పీవో పద్మావతి, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




