Markapuram: భర్త మరణంతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం!

Markapuram: కంభం మండలం అనంపల్లికి చెందిన చిట్టిబోయిన రాజ్యలక్ష్మికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా రూ.2 లక్షల బీమా పరిహారం అందింది. బ్యాంకు అధికారుల చొరవతో ఖాతాలో జమ అయ్యాయి.

Srikanth Singam, Markapur
Published on: 26 Nov 2026 3:18 PM IST
Markapuram
X

Markapuram: భర్త మరణంతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం!

మార్కాపురం జిల్లా: కంభం మండలంలోని అనంపల్లి గ్రామానికి చెందిన చిట్టిబోయిన రాజ్యలక్ష్మికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ద్వారా రూ.2 లక్షల బీమా పరిహారం అందింది. కెనరా బ్యాంకు తురిమెళ్ల శాఖ మేనేజర్ మూడవత్ శ్రీను నాయక్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీను, ఎస్.ఎస్.టి. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు పందీటి అశోక్ కుమార్, డోలు ఉదయ్ చొరవతో ఈ బీమా మొత్తం లబ్ధిదారురాలి బ్యాంకు ఖాతాలో జమ అయింది.

అనంపల్లి గ్రామానికి చెందిన చిట్టిబోయిన రాజ్యలక్ష్మి (43) భర్త చిట్టిబోయిన రంగస్వామి (48) గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో కంభం ఎస్.ఎస్.టి. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కెనరా బ్యాంకు తురిమెళ్ల శాఖ మేనేజర్ మూడవత్ శ్రీను నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు పందీటి అశోక్ కుమార్, డోలు ఉదయ్ ప్రజలకు పలు బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా బ్యాంకింగ్ పథకాలు, సామాజిక భద్రతా పథకాలు, డిజిటల్ బ్యాంకింగ్, ప్రైవేటు ఆర్థిక సంస్థల మోసాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్, క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి వివరించారు.

అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాల ప్రయోజనాలను వివరించారు. PMSBY పథకానికి ఏడాదికి రూ.20, PMJJBY పథకానికి ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే, బీమా నిబంధనల ప్రకారం ప్రమాద బీమా, జీవిత బీమా ద్వారా రూ.2 లక్షల వరకు పరిహారం పొందవచ్చని తెలిపారు. రూపే ఏటీఎం కార్డు వినియోగదారులకు కూడా ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో నిబంధనల ప్రకారం రూ.2 లక్షల వరకు బీమా సదుపాయం ఉంటుందని వివరించారు.

ఈ అవగాహన సమావేశంలో పాల్గొన్న చిట్టిబోయిన రాజ్యలక్ష్మి తన భర్త రంగస్వామి మరణించిన విషయాన్ని కౌన్సిలర్లకు తెలియజేశారు. తమకు ఇలాంటి బీమా పథకం ఒకటి ఉందనే విషయం కూడా తెలియదని, ఆర్థిక అక్షరాస్యత సమావేశం ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని తెలిపారు. అనంతరం తన భర్త బ్యాంకు పాస్‌బుక్‌ను కెనరా బ్యాంకు అధికారులకు చూపించగా, తురిమెళ్ల శాఖలో ఖాతా స్టేట్‌మెంట్ పరిశీలించారు. రంగస్వామి ఖాతా నుంచి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకు సంబంధించిన ప్రీమియం చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు.

దీంతో తురిమెళ్ల కెనరా బ్యాంకు శాఖ మేనేజర్ మూడవత్ శ్రీను నాయక్ బీమా క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించారు. అవసరమైన దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసిన అనంతరం, రంగస్వామి నామినీ అయిన ఆయన భార్య రాజ్యలక్ష్మి బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల బీమా పరిహారం జమ చేశారు.

ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. తన భర్త మరణంతో కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ సమయంలో అందిన రూ.2 లక్షల బీమా మొత్తం తన కుమారుడి చదువుకు, కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకుంటానని తెలిపారు. తమకు ఇంతటి ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన కెనరా బ్యాంకు తురిమెళ్ల శాఖ మేనేజర్ మూడవత్ శ్రీను నాయక్‌కు, ఎస్.ఎస్.టి. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి. అశోక్ కుమార్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బీమా ప్రయోజనం అందేలా సహకరించిన కౌన్సిలర్లు పందీటి అశోక్ కుమార్, డోలు ఉదయ్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur