Markapuram: రసాయన రహిత సాగుతోనే ఆరోగ్యం భద్రం: జేసీ శ్రీనివాసులు!
Markapuram: మార్కాపురం మండలం బిరుదులనరవలో APCNF ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన జేసీ పులి శ్రీనివాసులు.. రసాయన రహిత సాగుతోనే నేల, ప్రజారోగ్యం భద్రమని స్పష్టం చేశారు.
Markapuram: రసాయన రహిత సాగుతోనే ఆరోగ్యం భద్రం: జేసీ శ్రీనివాసులు!
మార్కాపురం: మార్కాపురం మండలం బిరుదులనరవ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఆధారిత ప్రకృతి వ్యవసాయం (APCNF) కింద సాగు చేస్తున్న పంటలను జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, జీవామృతం, ఘనజీవామృతం, కషాయాల వినియోగం, పంటల ఎదుగుదల, వేరు వ్యవస్థను పరిశీలించి రైతులతో మాట్లాడి సాగు వివరాలను తెలుసుకున్నారు.
రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు సూచించారు. సహజ పద్ధతులతో నేల సారం, తేమ నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందించవచ్చని తెలిపారు.
రసాయన రహిత ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOs) ద్వారా మెరుగైన ధరలు పొందేందుకు అవకాశాలున్నాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఇతర రైతులకు అవగాహన కల్పించి, ఈ సాగు విధానాన్ని మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు.




