Markapuram: మార్కాపురంలో చడ్డీ గ్యాంగ్ కలకలం.. పోలీసుల తనిఖీలు!
Markapuram: ఒంగోలు, మార్కాపురం పరిసర ప్రాంతాలలో 'చడ్డీ గ్యాంగ్' సంచరిస్తోందన్న సమాచారంతో ప్రకాశం జిల్లా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
Markapuram: మార్కాపురంలో చడ్డీ గ్యాంగ్ కలకలం.. పోలీసుల తనిఖీలు!
Markapuram: ఒంగోలు ప్రాంతంలో “చడ్డీ గ్యాంగ్” సంచరిస్తున్నదనే సమాచారంతో మార్కాపురం పోలీసులు అప్రమత్తమయ్యారు. మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, మార్కాపురం డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో, మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా మార్కాపురం టౌన్ ఎస్సై విశ్వనాథరెడ్డి, రూరల్ ఎస్సై వేమన సమక్షంలో పట్టణంలోని వివిధ లాడ్జీలు, అనుమానాస్పద ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో గస్తీ నిర్వహించారు. ఇటీవల “చడ్డీ గ్యాంగ్” సంచారం ఉన్నదనే సమాచారంతో పట్టణ శివార్లలో గుడారాలు వేసుకుని సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. వారి పూర్తి వివరాలు నమోదు చేసి, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
పట్టణ ప్రజల భద్రత దృష్ట్యా రాత్రి వేళల్లో పోలీసులు ప్రత్యేక పహారా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.
ప్రజలకు పోలీసులు సూచించిన జాగ్రత్తలు
రాత్రి సమయాల్లో ఇళ్ల తలుపులు, కిటికీలు తప్పనిసరిగా బిగించి పెట్టుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. నగదు, బంగారు ఆభరణాలను భద్రంగా ఉంచుకోవాలి. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండి పొరుగువారితో సమన్వయం కలిగి ఉండాలి.
ఒంటరిగా నివసించే వృద్ధులు, మహిళల ఇళ్లపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వాహనాలు లేదా వ్యక్తులు కనిపించిన వెంటనే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం అందించాలని సిఐ అల్తాఫ్ హుస్సేన్ కోరారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే నేరాలను అరికట్టడం సులభమవుతుందని అధికారులు పేర్కొన్నారు.




