Yerragondapalem: ఎన్నికలకు ముందే దోర్నాలలో కోతుల బెడదకు పరిష్కారం: దేవయ్య యాదవ్!
Yerragondapalem: మార్కాపురం జిల్లా దోర్నాల మేజర్ పంచాయతీలో కోతుల బెడదకు ఎన్నికలకు ముందే పరిష్కారం చూపుతామని కూటమి సర్పంచ్ అభ్యర్థి ఇరకసాని దేవయ్య యాదవ్ హామీ ఇచ్చారు.
Yerragondapalem: ఎన్నికలకు ముందే దోర్నాలలో కోతుల బెడదకు పరిష్కారం: దేవయ్య యాదవ్!
యర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా దోర్నాల మేజర్ గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న కోతుల బెడదకు ఎన్నికలకు ముందే పరిష్కారం చూపిస్తామని కూటమి సర్పంచ్ అభ్యర్థి ఇరకసాని దేవయ్య యాదవ్ ప్రకటించారు. గెలిచిన తర్వాత సమస్యల పరిష్కారం గురించి ఆలోచించడం కాకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇప్పటి నుంచే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపటి నుంచే దోర్నాల మేజర్ పంచాయతీ పరిధిలో కోతులను పట్టించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో ప్రజలు ప్రధానంగా కోతుల బెడద సమస్యను తన దృష్టికి తీసుకొస్తున్నారని దేవయ్య తెలిపారు. ఇళ్లలోకి చొరబడటం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి సమస్యలతో గ్రామస్తులు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించి ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ముందుగానే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దోర్నాల మేజర్ పంచాయతీ పరిధిలోని దోర్నాల, హాసనాబాద్, తిమ్మాపురం, కడపరాజుపల్లి, ఐనముక్కల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలుగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రతి వార్డులో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సహకారంతో పంచాయతీకి అవసరమైన అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తానని దేవయ్య యాదవ్ తెలిపారు.
సుమారు 25 ఏళ్ల క్రితం ఎర్రగొండపాలెం నుంచి దోర్నాలకు వచ్చానని, అప్పటి నుంచి గ్రామ ప్రజలు తనను ఆదరిస్తూ వస్తున్నారని గుర్తుచేశారు. తనకు ఆదరణ చూపించిన ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజాసేవకు ముందుకొచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నానని పేర్కొంటూ, ప్రజలు తనను ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇరకసాని దేవయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు.




