Podili: పొదిలిలో అర్ధరాత్రి దోపిడీ మహిళపై దాడి చేసి బంగారం, వెండి అపహరణ!

Podili: ప్రకాశం జిల్లా పొదిలిలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. శివాలయం వెనుక నివాసముంటున్న మహిళపై దాడి చేసి బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన దుండగులు.

MADARVALI, MARKAPURAM
Published on: 11 Nov 2026 10:39 AM IST
Podili
X

Podili: పొదిలిలో అర్ధరాత్రి దోపిడీ మహిళపై దాడి చేసి బంగారం, వెండి అపహరణ!

Podili: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు మహిళపై దాడి చేసి, భారీగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు మొబైల్ ఫోన్లను అపహరించుకెళ్లిన ఘటన పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పట్టణంలోని శివాలయం వెనుక నివాసం ఉంటున్న తువ్వ నారాయణమ్మ ఇంట్లో ఈ చోరీ జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వచ్చి ఇంటి తలుపు వేసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా తలుపును నెట్టి ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఆమె నోటికి కర్చీఫ్ అడ్డుపెట్టి దాడి చేయడంతో స్పృహ కోల్పోయినట్లు బాధితురాలు వెల్లడించారు.

ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను సేకరించి, మొబైల్ ఫోన్లను సైతం అపహరించుకెళ్లారు. చోరీకి గురైన వస్తువుల్లో బంగారు నల్లపూసల తాడు, ఉంగరాలు, అబ్బాయికి చెందిన బ్రాస్లెట్, చైన్, అమ్మాయికి చెందిన బొట్టా కమ్మలు, బ్రాస్లెట్లు తదితర బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. అదేవిధంగా సుమారు 20 నుంచి 25 గ్రాముల వరకు వెండి వస్తువులు కూడా అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు.

అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి మహిళపై దాడి చేసి చోరీకి పాల్పడిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో ఇలాంటి ఘటనలు జరగకుండా రాత్రివేళ పోలీసుల గస్తీని మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న పొదిలి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని విచారించి చోరీకి గురైన వస్తువుల వివరాలను సేకరించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

పట్టణ నడిబొడ్డున మహిళ ఇంట్లోకి చొరబడి ఈ స్థాయిలో చోరీకి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు త్వరితగతిన నిందితులను గుర్తించి, అపహరణకు గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM