Ongole: ఒంగోలులో ఘనంగా 5వ బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్!

Ongole: ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 5వ బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 26 Sept 2026 2:48 PM IST
Ongole
X

Ongole: ఒంగోలులో ఘనంగా 5వ బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్!

Ongole: ప్రజల విశ్వాసమే పోలీసుల విధులకు కొలమానమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన 5వ బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న నూతన కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.

పోలీస్ యూనిఫాం కేవలం దుస్తులు కాదని, ప్రజల పట్ల ఉన్న బాధ్యతకు గుర్తు అని మంత్రి పేర్కొన్నారు. విధుల్లో చేరే ప్రతి ఒక్కరూ ప్రజలతో గౌరవంగా, బాధ్యతగా, సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని సూచించారు.

దాదాపు ఐదు లక్షల మందికి పైగా దరఖాస్తుదారుల్లో అర్హత సాధించిన సుమారు ఆరు వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12 వేలకు పెంచినట్లు చెప్పారు.

యువతకు ఉద్యోగాలే లక్ష్యం

కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే సుమారు 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామని, డీఎస్సీ ద్వారా 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని చెప్పారు. విద్యుత్ శాఖలో 600కుపైగా ఏఈఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష పూర్తయిందని, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అర్హులకు త్వరలో ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.

కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, విజయ్‌కుమార్‌, కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుతో పాటు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.