Parchuru: పర్చూరు, అద్దంకి చెరువుల నింపునకు నీటి విడుదల విజ్ఞప్తి!

Parchuru: పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో తాగునీటి కోసం సాగర్ నీటి విడుదలను మరో వారం పొడిగించాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 12 Sept 2026 8:03 AM IST
Parchuru
X

Parchuru: పర్చూరు, అద్దంకి చెరువుల నింపునకు నీటి విడుదల విజ్ఞప్తి!

Parchuru: అద్దంకి నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెరువులను నింపేందుకు నాగార్జునసాగర్‌ నీటి విడుదలను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కోరారు.

ఎన్ఎస్‌పీ నీటి విడుదల షెడ్యూల్‌ శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో.. క్షేత్రస్థాయిలో నెలకొన్న తాగునీటి అవసరాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ప్రజాప్రతినిధుల కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్లారు.

సాగర్‌ నీటి విడుదలను మరో వారం పాటు పొడిగించి పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లోని చెరువులకు నీటిని అందించాలని కోరారు. తాజాగా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కూడా ఇదే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కూడా సాగర్‌ నీటి విడుదలను పొడిగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి కోరారు. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసం సాగర్‌ నీరు అత్యవసరంగా అవసరమని వివరించారు.

సాగర్‌ నీటి విడుదలను మరో వారం రోజులు పొడిగిస్తే ఆయా ప్రాంతాల్లోని మరిన్ని చెరువులకు నీటిని మళ్లించి తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు భూగర్భ జలాల లభ్యతను మెరుగుపరిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు పరిశీలించి, అత్యవసరంగా నీరు అవసరమైన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు.

సాగర్‌ నీటి విడుదల మరో వారం పొడిగిస్తే పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లోని మరిన్ని చెరువులకు నీరు చేరి తాగునీటి సమస్యకు గణనీయంగా ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala