Anganwadi: అంగన్వాడీలపై పనిభారానికి నూతన ఆర్థిక విధానాలే కారణం: సీఐటీయూ
Anganwadi: చీరాలలో అంగన్వాడీ యూనియన్ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పనిభారానికి నూతన ఆర్థిక విధానాలే కారణమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి అజయ్‌కుమార్ అన్నారు.
Anganwadi: అంగన్వాడీలపై పనిభారానికి నూతన ఆర్థిక విధానాలే కారణం: సీఐటీయూ
Anganwadi: అంగన్వాడీలపై పనిభారం విపరీతంగా పెరగడానికి, వారికి కనీస వేతనాలు అమలు కాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. అజయ్‌కుమార్ అన్నారు.
చీరాలలోని స్థానిక యూటీఎఫ్ కార్యాలయం దాచూరి రామిరెడ్డి భవన్‌లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర నాయకత్వ శిక్షణా తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ శిక్షణా తరగతులకు కె. లక్ష్మీదేవి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా ‘నూతన ఆర్థిక విధానాలు–కార్మిక వర్గంపై ప్రభావం’ అనే అంశంపై పి. అజయ్ కుమార్ శిక్షణా తరగతిని నిర్వహించారు. 1991 నుంచి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ పేరుతో అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాలు బడా కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారుల ప్రయోజనాలకే అనుకూలంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.
ఈ విధానాల కారణంగా అంగన్వాడీలను స్కీమ్ వర్కర్లుగా మాత్రమే పరిగణిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా, వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించకుండా పనిభారం పెంచుతున్నారని అన్నారు. శాశ్వత ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, స్కీమ్ వర్కర్ల పేరుతో కార్మికులపై శ్రమ దోపిడీ పెరుగుతోందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికులు, ఉద్యోగుల హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాల ఫలితంగా దేశంలో బడా ధనవంతుల సంపద భారీగా పెరుగుతోందని, 2014లో 70గా ఉన్న డాలర్ బిలియనీర్ల సంఖ్య 2026 నాటికి 308కు చేరిందని తెలిపారు.
దేశంలోని ఒక శాతం అత్యంత ధనవంతుల వద్ద 49 శాతం సంపద కేంద్రీకృతమై ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించేందుకు నిధులు లేవని చెప్పడం దారుణమన్నారు.
ఐసీడీఎస్‌ను శాశ్వతీకరించడంతో పాటు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటే ఐక్య పోరాటాలే మార్గమని అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు.
శాస్త్రీయ దృక్పథంతో సామాజిక చైతన్యం
శిక్షణా తరగతుల్లో ‘శాస్త్రీయ ఆలోచన’ అనే అంశంపై యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు బోధించారు. సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు, అజ్ఞానాన్ని తొలగించేందుకు శాస్త్రీయ దృక్పథం అవసరమన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే అంగన్వాడీ కార్యకర్తలు ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలు, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుబ్బారావమ్మ, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కె. రేఖ, ఎలిజబెత్, కె. ఝాన్సీ, పి. ప్రమీల, ఎ. బ్యూలా, సీఐటీయూ జిల్లా నాయకులు ఎన్. బాబురావు, ఎం. వసంతరావు తదితరులు పాల్గొన్నారు.




