Ongole: పురపాలక ఎన్నికలకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలి

Ongole: ఒంగోలు కార్పొరేషన్‌లో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ పి. రాజాబాబు తనిఖీ చేశారు. తొలిరోజు మేయర్‌కు సున్నా, వార్డు స్థానానికి 1 నామినేషన్ దాఖలైంది.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 16 Oct 2026 6:29 PM IST
Ongole
X

Ongole: పురపాలక ఎన్నికలకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలి

ఒంగోలు: పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ప్రణాళికతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. రాజాబాబు ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు.

శుక్రవారం ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ, ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఒంగోలు నగరపాలక సంస్థను నాలుగు జోన్లుగా విభజించిన నేపథ్యంలో జోనల్ అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 62 డివిజన్లకు 21 మంది రూట్ ఆఫీసర్లను నియమించాలని, ఎన్నికల విధుల నిర్వహణ కోసం సమర్థులైన అధికారులతో అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించే ఎంసీసీ కమిటీని శుక్రవారమే నియమించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో అధికారులు చురుగ్గా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

అనంతరం తొలి రోజు నామినేషన్ల స్వీకరణ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని, వార్డు సభ్యుని స్థానానికి ఒక నామినేషన్ దాఖలైనట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య కలెక్టర్‌కు వివరించారు. అనంతరం రిటర్నింగ్ అధికారులతో మాట్లాడి నామినేషన్ ప్రక్రియపై సమీక్షించారు.

ఈ తనిఖీలో ఒంగోలు ఆర్డీవో టి. చంద్రశేఖర్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.