Ongole: ఒంగోలు కార్పొరేషన్‌లో కూటమి సయోధ్య: డివిజన్ల కేటాయింపు!

Ongole: ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. మేయర్ అభ్యర్థి శ్రీశిల్పను గెలిపించాలని ఎమ్మెల్యే దామచర్ల పిలుపునిచ్చారు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 26 Oct 2026 1:07 AM IST
Ongole
X

Ongole: ఒంగోలు కార్పొరేషన్‌లో కూటమి సయోధ్య: డివిజన్ల కేటాయింపు!

ఒంగోలు: ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా సమన్వయంతో పోటీ చేయనున్నట్లు కూటమి నాయకులు ప్రకటించారు. డివిజన్ల వారీగా ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో వెల్లడిస్తూ, కూటమి అభ్యర్థులతో పాటు మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్పను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆదివారం ఒంగోలులోని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఉడా చైర్మన్ షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, జనసేన రాష్ట్ర నాయకుడు కంది రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా పోటీ చేసే పార్టీల వివరాలను వెల్లడించారు.

డివిజన్ల వారీగా పార్టీల పోటీ..

బీజేపీ 11, 22వ డివిజన్లలో పోటీ చేయనుండగా, జనసేన పార్టీ 1, 4, 32, 40, 50, 51వ డివిజన్లలో బరిలోకి దిగనుంది. టీడీపీ, జనసేన మధ్య స్నేహపూర్వక పోటీగా 17, 21, 26, 35, 38, 39, 46, 47, 48వ డివిజన్లను ప్రకటించారు.

టీడీపీ అభ్యర్థులు 2, 3, 5 నుంచి 16 వరకు, 18 నుంచి 20 వరకు, 23, 24, 27 నుంచి 31 వరకు, 33, 34, 36, 37, 41 నుంచి 45 వరకు, 49, 52 నుంచి 56 వరకు, 59 నుంచి 62వ డివిజన్లలో పోటీ చేయనున్నట్లు నాయకులు తెలిపారు. 25, 57, 58వ డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు.

నగర అభివృద్ధే ప్రధాన లక్ష్యం…

ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఒంగోలు నగర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని మూడు పార్టీలు పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తారని వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్పతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, షేక్ రియాజ్, సెగ్గం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.