Ongole: ఎస్పీ ఆఫీస్‌కు వెల్లువెత్తిన జనం.. ‘మీకోసం’లో 100 అర్జీలు!

Ongole: ఒంగోలులో 'మీకోసం' కార్యక్రమానికి 100 అర్జీలు వచ్చాయి. ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 7 Sept 2026 5:27 PM IST
Ongole
X

Ongole: ఎస్పీ ఆఫీస్‌కు వెల్లువెత్తిన జనం.. ‘మీకోసం’లో 100 అర్జీలు!

ఒంగోలు: ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 100 మంది ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీతో పాటు పోలీసు అధికారులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో సమగ్రంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్పీ హామీ ఇచ్చారు.

అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫిర్యాదులపై ఎస్పీ మాట్లాడారు. ‘మీకోసం’ కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారించి, చట్టప్రకారం సమగ్ర విచారణ జరిపి ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్‌డివిజన్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు అందజేయవచ్చని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, భర్త లేదా అత్తారింటి వేధింపులు, చీటింగ్, ఉద్యోగాల పేరుతో మోసాలు తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు అందజేశారు.

కార్యక్రమంలో ఒంగోలు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హాజరత్తయ్య, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, వీవీపాలెం ఎస్సై ప్రేమ్‌కుమార్, ప్యానెల్ అడ్వొకేట్ బి. బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story