Podili: బ్యాంకు ఉద్యోగుల ఒక్కరోజు సమ్మె విజయవంతం

Podili: పొదిలిలో ఘనంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె. ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్. నిలిచిపోయిన పలు బ్యాంకుల లావాదేవీలు.

MADARVALI, MARKAPURAM
Published on: 11 Sept 2026 11:49 PM IST
Podili
X

Podili: బ్యాంకు ఉద్యోగుల ఒక్కరోజు సమ్మె విజయవంతం

పొదిలి: బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఒకరోజు సమ్మె విజయవంతమైంది. ఈ సందర్భంగా పొదిలిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాల విధానం అమలు చేయాలని, పనితీరు ఆధారంగా అమలు చేస్తున్న ప్రోత్సాహక పథకాలలో ఉన్న వివక్షను తొలగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రెండు విడతలుగా సమ్మె కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్ల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో వరుసగా మూడు రోజులపాటు సమ్మె నిర్వహిస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

శుక్రవారం నిర్వహించిన సమ్మె కారణంగా పొదిలి పట్టణంలోని కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. అలాగే కుంచేపల్లి, ఉప్పలపాడులోని యూనియన్ బ్యాంక్ శాఖలు, మర్రిపూడి మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, జువ్విగుంటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాకర్లలోని కెనరా బ్యాంక్ పరిధిలోనూ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు బాబు, నాగేంద్ర, కుమార్, వాసు, అన్నపూర్ణ, విజయలక్ష్మితో పాటు పొదిలి, మర్రిపూడి మండలాల పరిధిలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM