Ongole: అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు!

Ongole: ఒంగోలు ప్రకాశం భవనంలో ‘మీకోసం’ కార్యక్రమంలో 246 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 7 Sept 2026 6:36 PM IST
Ongole
X

Ongole: అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు!

Ongole: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. ‘మీకోసం’ (PGRS)లో వచ్చే ప్రతి అర్జీని బాధ్యతగా పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు.

సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్వో పి. వెంకటరమణ తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 246 అర్జీలు సమర్పించారు.

PGRSతో పాటు కలెక్టరేట్‌లో నేరుగా అందే అర్జీలు, CMO నుంచి వచ్చే వినతులు, మండల స్థాయి ఫిర్యాదులు, ‘పల్లె నిద్ర’ కార్యక్రమాల్లో స్వీకరించిన అర్జీలను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. అర్జీ నమోదైన వెంటనే సంబంధిత వ్యక్తికి జిల్లా కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

కేవలం కింది స్థాయి సిబ్బంది నివేదికలపైనే ఆధారపడకుండా జిల్లా స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను స్వయంగా పరిశీలించాలన్నారు. అర్జీలను సాంకేతిక కారణాలతో తిరస్కరించి ముగించకుండా, సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని స్పష్టం చేశారు. పరిష్కారం సాధ్యం కాని సందర్భాల్లో కారణాలను అర్జీదారులకు స్పష్టంగా వివరించాలన్నారు.

రీ-ఓపెన్ అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. IVRS సర్వేలో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, ఈడీ బీసీ కార్పొరేషన్ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story