Addanki: పోలీస్ కారులో గంజాయి, మద్యం బాటిల్స్ కలకలం
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడులో రోడ్డు ప్రమాదానికి గురైన పోలీసుల కారులో గంజాయి, మద్యం బాటిల్స్ లభ్యం. స్థానికంగా తీవ్ర చర్చ.
Addanki: పోలీస్ కారులో గంజాయి, మద్యం బాటిల్స్ కలకలం
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు గ్రామంలో రోడ్డు ప్రమాదం తీవ్ర చర్చకు దారితీసింది. బల్లికురవ నుంచి అద్దంకి వైపు వెళ్తున్న కారు.. ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన కారులో ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు పోలీస్ అధికారులు మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
అనంతరం గ్రామస్తులు కారును క్షుణ్ణంగా పరిశీలించగా.. అందులో మద్యం బాటిల్స్ కనిపించినట్లు తెలిపారు. కారు వెనుక డిక్కీలో భారీ మొత్తంలో గంజాయి కనిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీసులకు సంబంధించిన వాహనంలో గంజాయి, మద్యం బాటిల్స్ బయటపడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సమాచారం అందుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు, ఎస్‌ఐ సాయికుమార్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. కారు చుట్టూ గుమిగూడిన గ్రామస్తులను పోలీసులు పక్కకు తరలించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎడమ కంటి కోటిరెడ్డి, పాలపర్తి మంగమ్మ, పాలపర్తి కోటేశ్వరమ్మలకు అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు, నరసరావుపేట ఆసుపత్రులకు తరలించారు.
ఇదిలా ఉండగా.. పోలీస్ శాఖకు చెందిన అధికారులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి, మద్యం బాటిల్స్ బయటపడటంపై శంకవరప్పాడు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్లికురవ, సంతమాగులూరు పోలీస్ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కారులో గంజాయి ఎలా వచ్చింది? మద్యం బాటిల్స్ ఎందుకు ఉన్నాయి? ప్రమాదానికి ముందు కారులో మద్యం సేవించారా? గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చకు దారితీశాయి.
అయితే, కారులో గంజాయి, మద్యం బాటిల్స్ ఉన్నాయనే విషయం, వాటి స్వభావం, వాటికి సంబంధించిన వ్యక్తులపై ఆరోపణలు వంటి అంశాలు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పోలీస్ వాహనంలోనే గంజాయి, మద్యం బాటిల్స్ బయటపడిన ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




