Addanki: ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయ వాతావరణం!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉద్రిక్తత. ఎంపీటీసీ అభ్యర్థి సురభి జేమ్స్ కిడ్నాప్ యత్నమంటూ వైసీపీ ఆరోపణ. ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో వేడెక్కిన రాజకీయం.
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయ వాతావరణం!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కలవకూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి సురభి జేమ్స్‌ను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అద్దంకి పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్క బజారులో ఉన్న న్యాయవాది దాచేపల్లి హైగ్రీవ చారి నివాసం వద్ద ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సురభి జేమ్స్‌ను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నేతలు వచ్చారంటూ ఆరోపించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పరస్పరం వాగ్వాదానికి దిగిన ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి, అక్కడి నుంచి పంపించారు.
గత మూడు రోజులుగా ప్రశాంతంగా ఉన్న అద్దంకి పట్టణంలో ఈ ఘటనతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసలు ఏం జరిగింది? కిడ్నాప్ ఆరోపణల్లో వాస్తవాలేమిటి? అనే అంశాలపై పట్టణ ప్రజల్లో చర్చ మొదలైంది.
ఈ ఘటనపై పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.




