Parchur: పర్చూరులో సాకారమైన జలసిరి.. 52 గ్రామాలకు తాగునీటి భరోసా!

Parchur: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రూ.22.02 కోట్లతో 52 గ్రామాల్లో తాగునీటి పథకాల పునరుద్ధరణ. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నిరంతర కృషితో సాకారమైన జలసిరి

KaleshaVali (Bhasha), Chirala
Published on: 13 Sept 2026 1:15 PM IST
Parchur
X

Parchur: పర్చూరులో సాకారమైన జలసిరి.. 52 గ్రామాలకు తాగునీటి భరోసా!

Parchur: నిన్నటి వరకు బిందెడు నీటి కోసం ఎదురుచూపులు.. నేడు ఇంటింటికీ నల్లా నీటి భరోసా! ఏళ్లుగా మూలనపడిన తాగునీటి పథకాలను కదిలించి.. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి.. ప్రభుత్వ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లి.. నిధులు మంజూరయ్యే వరకు పట్టువదలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషి ఫలించింది. పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 52 గ్రామాల తాగునీటి పథకాల పునరుద్ధరణకు రూ.22.02 కోట్లు మంజూరయ్యాయి. దీంతో పల్లె ప్రజల గొంతు తడిపే జలసిరికి కొత్త బాటలు పడ్డాయి..

నిలిచిన పథకాలకు పునర్జీవం

జల్‌జీవన్‌ మిషన్‌ కింద గతంలో మంజూరైన పలు తాగునీటి పథకాలు నిధుల కొరత, సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో మధ్యలోనే నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ఏలూరి.. నియోజకవర్గంలో ఏ గ్రామమూ తాగునీటి కోసం ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో నిలిచిపోయిన పథకాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ కృషి ఫలితంగానే రీస్ట్రక్చర్డ్‌ సింగిల్‌ విలేజ్‌ స్కీమ్‌ (SVS)ల కింద 52 గ్రామాల పథకాలకు నిధులు సమకూరాయి.

ఆరు మండలాల్లో.. 52 గ్రామాలు

చినగంజాం, ఇంకొల్లు, కారంచేడు, యద్దనపూడి, మార్టూరు, పర్చూరు మండలాల్లోని 52 గ్రామాలకు ఈ పథకాలతో ప్రయోజనం చేకూరనుంది. ఆయా గ్రామాల్లోని హాబిటేషన్లకు తాగునీటి మౌలిక వసతులను పునరుద్ధరించి ఇంటింటికీ నల్లా నీరు అందించనున్నారు.

చినగంజాం మండలంలోని కడవకుదురు, చినగంజాం, చింతగుంపల్లి, గోనసపూడి, పెదగంజాం, సంతరావూరు.. ఇంకొల్లు మండలంలోని భీమవరం, ఇడుపులపాడు, దుద్దుకూరు, గంగవరం, ఇంకొల్లు, కొనికి, నాగండ్ల, పావులూరు, పూసపాడు గ్రామాలు ఉన్నాయి.

కారంచేడు మండలంలోని ఆదిపూడి, దగ్గుబాడు, కారంచేడు, కేశవరపాడు, కొడవలివారిపాలెం, కుంకలమర్రు, స్వర్ణ.. యద్దనపూడి మండలంలోని అనంతవరం, యద్దనపూడి, జగర్లమూడి, పునూరు, తనుబోడ్డువారిపాలెం గ్రామాలకూ ప్రయోజనం కలగనుంది.

మార్టూరు మండలంలోని బొల్లాపల్లి, బొబ్బేపల్లి, దర్శి, ద్రోణాదుల, జొన్నతాళ్ల, కొల్లాలపూడి, కొనంకి, లక్కవరం, మార్టూరు, నాగరాజుపల్లి, రాజుపాలెం, వలపర్ల.. పర్చూరు మండలంలోని అడుసుమల్లి, బోడవాడ, మందగుంట, చెన్నుభొట్లవారిపాలెం, చెరుకూరు, దేవరపల్లి, గర్నెపూడి, గొల్లపూడి, ఇనగల్లు, నూతలపాడు, పర్చూరు, రమణయపాలెం, ఉప్పుటూరు, వీరన్నపాలెం గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి.

రూ.22.02 కోట్లతో పనులు

నియోజకవర్గంలో 52 గ్రామాల్లో తాగునీటి మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.22.02 కోట్లు మంజూరు చేసింది. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడంతోపాటు అవసరమైన చోట పైప్‌లైన్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు తదితర పనులు చేపట్టనున్నారు.

‘ప్రతి ఇంటికీ నీరు’ లక్ష్యంగా..

పర్చూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కొంతకాలంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తాగునీటి వనరుల కల్పన, పథకాల పునరుద్ధరణ, కొత్త మౌలిక వసతుల ఏర్పాటుపై దృష్టి సారించారు. తాజాగా 52 గ్రామాల పథకాలకు రూ.22.02 కోట్లు మంజూరు కావడంతో ఆ దిశగా మరో కీలక అడుగు పడింది.పథకాల పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పనులు పూర్తయితే 52 గ్రామాల్లోని వేలాది కుటుంబాలకు సురక్షిత తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రానుంది.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala