Prakasam: సంచలనం సృష్టించిన చీమకుర్తి భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు

Prakasam: ప్రకాశం జిల్లా చీమకుర్తి వెంకటేశ్వర హార్డ్‌వేర్ దుకాణంలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.

Showry Doas, Staff Reporter -Ongole
Updated on: 23 May 2026 12:33 PM IST
Prakasam
X

Prakasam: సంచలనం సృష్టించిన చీమకుర్తి భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు

ప్రకాశం: జిల్లాలో సంచలనం రేపిన చీమకుర్తి భారీ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చీమకుర్తిలోని వెంకటేశ్వర హార్డ్‌వేర్ దుకాణంలో జరిగిన భారీ చోరీ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 34 సవర్ల బంగారం, దాదాపు 2 కిలోల వెండి, రూ.5 లక్షల 95 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.37 లక్షలు ఉంటుందని చెప్పారు.

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, వేలిముద్రల విశ్లేషణ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు ప్రసాద్ ఇప్పటికే పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడిన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, అతనిపై 13 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు.

నిందితులు రాత్రివేళల్లో రూఫ్‌టాప్‌ల ద్వారా దుకాణాల పైకప్పుల మీద నుంచి లోపలికి ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. చీమకుర్తిలో జరిగిన చోరీలో కూడా ఇదే పద్ధతిని అనుసరించినట్లు పోలీసులు గుర్తించారు. దుకాణంలోని లాకర్లు పగులగొట్టి నగదు, బంగారం, వెండి అపహరించినట్లు తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాలను ఎస్పీ అభినందించారు. ప్రజలు తమ దుకాణాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story