Markapuram: మార్కాపురంలో ఎస్టీయూ సభ్యత్వ నమోదు షురూ!

Markapuram: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) మార్కాపురం మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 20 Jun 2026 6:55 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో ఎస్టీయూ సభ్యత్వ నమోదు షురూ!

మార్కాపురం: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) మార్కాపురం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఎర్రయ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండలంలోని పలు పాఠశాలలను సందర్శించిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటి పరిష్కార మార్గాలపై సూచనలు చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెదయాచవరం నందు నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు.

విద్యా హక్కు చట్టం–2009 ప్రకారం ఆ చట్టం అమలులోకి రాకముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ అర్హతను తప్పనిసరి చేయలేదని ఆయన పేర్కొన్నారు. తదనంతరం నిర్వహించిన డీఎస్సీలలో టెట్ అర్హతతోనే ఉపాధ్యాయ నియామకాలు జరిగినందున, 2009కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తిస్థాయి మినహాయింపు కల్పించాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

అలాగే నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో డీఈఓ కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం పాత జిల్లా కేంద్రం ఒంగోలుకు వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల సమయం, ధనం, శ్రమ వృథా అవుతున్నందున మార్కాపురం డీఈఓ కార్యాలయంలో తగినంత సిబ్బందిని నియమించి, ఉపాధ్యాయుల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా ఎంపీపీఎస్ బోడపాడు, రాజుపాలెం, యాచవరం, ముద్దులపల్లి, నాయుడుపల్లి, మన్నెవారిపల్లి, గజ్జలకొండ, తూరుపల్లి, మాలపాటిపల్లి, రాయవరం, తదితర గ్రామాలలోని పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయ వాణి కన్వీనర్ sk యూసఫ్ షరీఫ్, మండల శాఖ అధ్యక్షులు అక్కల నారాయణ, మార్కాపురం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిశేషు, కార్యవర్గ సభ్యులు ఎం. జాకబ్, ఎం. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story