Markapuram: మార్కాపురం జిల్లాలో ఘనంగా ప్రారంభించిన వేసవి శిక్షణ శిబిరం

Markapuram: మార్కాపురంలో శ్రీ కోడి రామమూర్తి క్రీడా, సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఘనంగా ప్రారంభమైంది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 4 May 2026 10:49 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జిల్లాలో ఘనంగా ప్రారంభించిన వేసవి శిక్షణ శిబిరం

మార్కాపురం: శ్రీ కోడి రామమూర్తి క్రీడా, సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో, ప్రకాశం జిల్లా క్రీడా అభివృద్ధి ప్రాధికార సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన శిక్షకులు, ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి క్రీడల ప్రాముఖ్యతపై విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు పిన్నిక నాగేశ్వరరావు మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు క్రీడల్లో ప్రతిభను చాటుకునే అవకాశాలు కల్పించడం మా సంఘ ప్రధాన లక్ష్యం. ఉచితంగా ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పించాం. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో సాధన చేయాలి” అని తెలిపారు.

సంఘ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, “విద్యతో పాటు క్రీడలు కూడా సమానంగా ముఖ్యమైనవి. శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెంపొందించడానికి క్రీడలు ఎంతో అవసరం. ఈ శిబిరంలో ఫుట్‌బాల్, బాక్సింగ్, కర్రసామ్ వంటి విభిన్న క్రీడల్లో నిపుణులైన శిక్షకుల ద్వారా శిక్షణ అందించడం జరుగుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాం” అని అన్నారు. ప్రకాశం జిల్లా ఫుట్‌బాల్ కోచ్ కె. పాల్ కుమార్ మాట్లాడుతూ, “ఫుట్‌బాల్ వంటి జట్టు క్రీడలు విద్యార్థుల్లో సమన్వయం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మంచి ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇలాంటి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయి” అన్నారు.

దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వైద్య సంజీవ్ మాట్లాడుతూ, “ప్రతిరోజూ క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న వయసులోనే వ్యాయామం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు” అని సూచించారు. ప్రకాశం జిల్లా బాక్సింగ్ కోచ్ పాణ్యం వేణు మాట్లాడుతూ, “బాక్సింగ్ క్రీడ ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కష్టపడి సాధన చేస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి” అన్నారు.

మార్కాపురం మధు చిన్నపిల్లల ఆసుపత్రి డాక్టర్ మాధవరావు మాట్లాడుతూ, “కర్రసాము వంటి సంప్రదాయ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మన సంస్కృతిని కూడా కాపాడుతాయి. పిల్లలు ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు” అని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఫుట్ బాల్ శిక్షకులు ఉప్పు రామకృష్ణ గారు మార్కాపురం శిక్షకుడు విద్యార్థులు ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని తమ క్రీడా ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story