Prakasam: పనికి రాకుండానే వేతనాలు.. అధికారుల వాటాల పంపిణీ బాగోతం బయట!
Prakasam: తర్లుపాడు మండలంలో ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి. ఫేక్ యాప్‌లతో దొంగ మస్టర్లు వేస్తూ నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారులు.
Prakasam: పనికి రాకుండానే వేతనాలు.. అధికారుల వాటాల పంపిణీ బాగోతం బయట!
సాంకేతికతతో ‘మాయ’ చేస్తున్నారు ఇలా..
ప్రస్తుతం ఉపాధి పనుల్లో ముఖ ఆధారిత హాజరు (Face Recognition) అమలవుతోంది. అయితే, దీన్ని నీరుగారుస్తూ క్షేత్రస్థాయి అధికారి, ఫీల్డ్ అసిస్టెంట్లు, టిఏలు కుమ్మక్కై 'ఫేక్ ఎన్ఎన్ఎమ్ఎస్' (Fake NMMS) అనే యాప్‌ను వాడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూలీల నివాసాల వద్దే మరో సెల్ ఫోన్ ద్వారా వీడియోలు చిత్రీకరిస్తున్నారు. పని ప్రదేశంలో ఆ వీడియోలోని ముఖచిత్రం, కళ్ళ కదలికల ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. దీనివల్ల అసలు పని ముఖం చూడని ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా మస్టర్లలో ‘హాజరు’ అయిపోతున్నారు.
వసూళ్ల పర్వం - వాటాల పంపిణీ
పనికొచ్చే వారి వద్ద నుండి వారానికి రూ. 200, పనికి రాకుండానే హాజరు వేయించుకునే వారి వద్ద నుండి రూ. 400 నుండి 600 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు వాటాల రూపంలో పంచుకుంటున్నారని చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మీర్జాపేట, పోతలపాడు, గానుగపెంట, తాడివారి పల్లి, కలుజువ్వాలపాడు గ్రామాల్లో ఈ దొంగ మస్టర్ల పర్వం జోరుగా సాగుతోంది.
ఏపీఓ పర్యవేక్షణపై అనుమానాలు..
అక్రమాలను అరికట్టాల్సిన ఏపీఓ (APO), జిల్లా స్థాయి ఒత్తిడి నెపంతో పాత పనులనే కొత్తవిగా చూపాలని, హాజరు పెంచాలని సిబ్బందిని ఆదేశిస్తున్న ఆడియో రికార్డులు బయటకు రావడం కలకలం రేపుతోంది. కార్యాలయ స్టేషనరీ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించడం, మొక్కలు లేకుండానే హార్టికల్చర్ బిల్లులు చేయడం, గోకులం షెడ్ల లబ్ధిదారుల నుండి నగదు వసూలు చేయడం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దొంగ మస్టర్ల నమోదు వాస్తవమే: శ్రీరామ్ నాయక్ (MPDO)
"మండలంలోని ఉపాధి పనుల్లో దొంగ మస్టర్లు వేసినట్లు మా దృష్టికి వచ్చింది. మరొక ఫోన్ ద్వారా వీడియోలు తీసి హాజరు నమోదు చేసినట్లు గుర్తించాం. కేతగుడిపి, జగన్నాధపురం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశాం. పూర్తి నివేదికను జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌కు పంపించాం. విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం".




