Kanigiri: కనిగిరిలో ఉద్రిక్తత టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ!

Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరిలో ఉద్రిక్తత. నామినేషన్ల పరిశీలనలో వైసీపీ అభ్యర్థుల అడ్డుగింత ఆరోపణలు, బైఠాయించిన పులి శాంతి, దద్దాల నారాయణ యాదవ్.

Guravayya, Kanigiri
Published on: 19 Oct 2026 12:11 PM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరిలో ఉద్రిక్తత టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ!

Kanigiri: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కనిగిరిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థులను టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

నిన్న నామినేషన్ల దాఖలు సమయంలోనూ దాడులు జరిగాయని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి, వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. మరోవైపు, కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ టెంట్లను టీడీపీ కార్యకర్తలు తొలగిస్తున్నారనే ఆరోపణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాల కార్యకర్తలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో కనిగిరిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు స్థానికంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri