Markapuram: పొగాకు రైతుల భారీ ర్యాలీ.. ప్రధాన రహదారి దిగ్బంధం!
Markapuram: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కాపురం జిల్లా పొదిలిలో నిరసన జ్వాలలు మిన్నంటాయి.
Markapuram: పొగాకు రైతుల భారీ ర్యాలీ.. ప్రధాన రహదారి దిగ్బంధం!
Markapuram: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కాపురం జిల్లా పొదిలిలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు. స్థానిక పొగాకు వేలం కేంద్రం నుండి ఒంగోలు - కర్నూలు ప్రధాన రహదారి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పొదిలి యస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు నడుమే రైతులు, ప్రజా సంఘాల నాయకులు తమ నిరసన ప్రదర్శనను కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
మార్కెట్‌లో పొగాకు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి, వెయ్యి కోట్ల రూపాయలను మార్క్‌ఫెడ్‌కు కేటాయించాలని డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే నేరుగా పొగాకు కొనుగోళ్లు చేపట్టి, నష్టాల్లో ఉన్న రైతును ఆదుకోవాలని వారు కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కె.వి. రత్నం, లోక్‌సత్తా నాయకులు చంద్రశేఖర్, సిపియం నాయకులు నర్రా వెంకటేశ్వరరెడ్డి, రైతు సంఘం నాయకులు బణాల రామయ్య, పాల్గొన్నారు.




