Pakala: పాకల బీచ్‌లో విషాదం.. ఇద్దరు యువకులు మృతి
Pakala: సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి అలల ఉధృతికి ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ముగ్గురు సురక్షితం.
Pakala: పాకల బీచ్‌లో విషాదం.. ఇద్దరు యువకులు మృతి
ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన వారిపై ఒక్కసారిగా భారీ అల విరుచుకుపడటంతో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటనలో మరో ముగ్గురిని స్థానిక మత్స్యకారులు, పోలీసులు రక్షించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కనిగిరి మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన సుమారు 70 మంది తమ ఆచారం ప్రకారం పోలేరమ్మ జాతర నిర్వహించుకుని, సముద్ర స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద అల రావడంతో కొందరు సముద్రంలోకి కొట్టుకుపోయినట్లు బృంద సభ్యులు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానిక మత్స్యకారులు, పోలీసు సిబ్బంది పడవల సహాయంతో బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు.
ఈ ప్రమాదంలో పాలడుగు తేజ (20), బత్తుల మహేష్ బాబు (22) మృతి చెందారు. దేవల విష్ణు, దేవల నారాయణ గల్లంతయ్యారు. మనోజ్ కుమార్, మహేష్ తేజ, నరసింహలను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఘటన సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పాకల బీచ్‌ను సందర్శించి ప్రమాద వివరాలను, బాధిత కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గల్లంతైన వారి ఆచూకీ కోసం డ్రోన్లు, పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీచ్‌కు వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
క్షతగాత్రులకు ఒంగోలు జీజీహెచ్, కందుకూరులోని కోటారెడ్డి ఆసుపత్రి, ఒంగోలులోని రమేష్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అనంతరం కందుకూరు కోటారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహను కలెక్టర్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ప్రస్తుతం ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో కందుకూరు సబ్ కలెక్టర్ డి. హిమవంశి, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.




