Markapur: తాగునీటి కోసం ఫీడర్ కెనాల్‌ వద్దకు వెళ్తున్న గిరిజనులు!

Markapur: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం పనుకుమడుగులో తాగునీటి కోసం వెలుగొండ ఫీడర్ కెనాల్‌పై ఆధారపడుతున్న గిరిజనులు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.

Srikanth Singam, Markapur
Published on: 18 Sept 2026 2:01 PM IST
Markapur
X

Markapur: తాగునీటి కోసం ఫీడర్ కెనాల్‌ వద్దకు వెళ్తున్న గిరిజనులు!

Markapur: గుక్కెడు తాగునీటి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెలుగొండ ఫీడర్ కెనాల్ నుంచి నీటిని సేకరించాల్సిన దుస్థితి పనుకుమడుగు గిరిజన గూడెం ప్రజలకు ఎదురైంది. మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం పనుకుమడుగు గిరిజన గ్రామంలో గత పది రోజులుగా బోర్లు మరమ్మతులకు గురికావడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బోర్లను వెంటనే మరమ్మతులు చేయించాలని స్థానిక ఎంపీడీవో విజయ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లుకు పలుమార్లు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

తాగునీటికి మరో మార్గం లేకపోవడంతో ఆడ, మగ తేడా లేకుండా గిరిజనులు వెలుగొండ ఫీడర్ కెనాల్ వద్దకు వెళ్లి నీటిని సేకరిస్తున్నారు. కెనాల్‌లో నీటి ప్రవాహం ఉండటంతో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల వెలుగొండ ఫీడర్ కెనాల్‌లో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనను ఈ సందర్భంగా గిరిజనులు గుర్తు చేస్తున్నారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైనప్పటికీ, మరో యువకుడి మృతదేహం ఇంతవరకు లభ్యం కాలేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీటి కోసం ప్రజలు కెనాల్ వద్దకు వెళ్లాల్సి రావడం ఆందోళనకరమని అన్నారు.

గిరిజనుల ప్రాణాలు అత్యంత విలువైనవని, అధికారులు తక్షణమే స్పందించి పనుకుమడుగు గిరిజన గూడెంలో బోర్లకు మరమ్మతులు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur