Podili: అధ్వానంగా ఒంగోలు–కర్నూలు రాష్ట్ర రహదారి పరిస్థితి!
Podili: ఒంగోలు–కర్నూలు రాష్ట్ర రహదారిపై గుంతలు, డ్రైనేజీ నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని పొదిలి ప్రజల డిమాండ్.
Podili: అధ్వానంగా ఒంగోలు–కర్నూలు రాష్ట్ర రహదారి పరిస్థితి!
Podili: నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఒంగోలు–కర్నూలు రాష్ట్ర రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి రహదారికి కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో పలుచోట్ల రహదారి దెబ్బతిని ప్రమాదకరంగా మారింది.
పొదిలి పట్టణంలోని విశ్వనాథపురం సమీపంలో ఇండేన్ గ్యాస్ కార్యాలయం ఎదురుగా రహదారి సగభాగం వరకు కోతకు గురికావడంతో వాహనదారులు భయాందోళనల మధ్య ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎదురెదురుగా వాహనాలు వచ్చిన సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు రహదారిపై నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై గుంతలు నీటితో నిండిపోవడంతో వాటి లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఈ రహదారిపై నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ప్రయాణిస్తున్నప్పటికీ రహదారి దుస్థితిపై తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి, డ్రైనేజీ సమస్యను పరిష్కరించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
“పొదిలికి పట్టిన ఈ దుస్థితి నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో” అని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.




