Avatar 3 OTT: ఓటీటీలోకి అవతార్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Avatar Fire And Ash OTT Release: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ‘అవతార్ 3’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, డేట్ వివరాలు ఇవే!
Avatar Fire And Ash OTT Release
Avatar Fire And Ash OTT Release: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ వెండితెరపై సృష్టించిన అద్భుతం 'అవతార్' సిరీస్. ఈ ఫ్రాంచైజీ నుంచి గతేడాది డిసెంబర్‌లో విడుదలైన మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 12 వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ విజువల్ వండర్, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు:
థియేటర్లలో విడుదలైన దాదాపు మూడు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. మార్చి 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్ లలో 'రెంటల్' (అద్దె) ప్రాతిపదికన ఇంగ్లీష్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. ఇక భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ వెర్షన్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ ఆఖరున లేదా మే మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
కథా నేపథ్యం:
రెండో భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ముగింపు నుంచి ఈ మూడో భాగం కథ ప్రారంభమవుతుంది. తన పెద్ద కుమారుడిని కోల్పోయిన బాధలో ఉన్న జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్) కుటుంబాన్ని, అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) రూపంలో కొత్త ప్రమాదం పొంచి ఉంటుంది. చనిపోయి తిరిగి వచ్చిన కల్నల్ క్వారిచ్‌తో కలిసి ఆమె జేక్ కుటుంబంపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని చూసింది? అగ్ని తెగ శత్రువుల నుంచి జేక్ సల్లీ తన కుటుంబాన్ని, పాండోరా గ్రహాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే ఈ చిత్ర ఇతివృత్తం.
భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్‌తో సాగే ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. మరి ఓటీటీలో ఈ విజువల్ వండర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.



