Balan: The Boy : జైల్లో పుట్టిన బాలుడి హృదయాన్ని కదిలించే కథ.
మలయాళంలో వచ్చిన ఎమోషనల్ మిస్టరీ డ్రామా ‘బాలన్: ది బాయ్’ (Balan: The Boy). 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు
Balan
మలయాళంలో వచ్చిన ఎమోషనల్ మిస్టరీ డ్రామా ‘బాలన్: ది బాయ్’ (Balan: The Boy). 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కాగా, జూలై 31 నుంచి ZEE5 ఓటీటీ వేదికగా తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫర్జానా పలతింగల్, అధిశేషన్ కేఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం!
కథేంటంటే?
కథ మహిళల సెంట్రల్ జైలులో ప్రారంభమవుతుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ (ఫర్జానా పలతింగల్) మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బాలుడి పేరు బాలన్ (అధిశేషన్). జైల్లోనే పుట్టడంతో తన బాల్యాన్ని తల్లితో కలిసి జైలు గోడల మధ్యే గడుపుతాడు. అదే జైల్లో ఉన్న షమ్నమ్ (బీనా ఆంటోనీ) అనే మహిళ, జైలు నుంచి విడుదలైన మహిళలను వ్యభిచారంలోకి దింపుతుంటుంది.
శిక్ష పూర్తయి బయటకు వచ్చాక బాలన్ తల్లిని కూడా తన వలలో వేసుకోవడానికి షమ్నమ్ ప్రయత్నిస్తుంది. కానీ తన కొడుకు భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ఆ తల్లి.. తన గతాన్ని దాస్తూ పేర్లు, గుర్తింపులు, ప్రాంతాలు మారుస్తూ కాలం వెళ్లదీస్తుంటుంది. అలా తిరుగుతూ ఒక అటవీ ప్రాంతం సమీపంలోని ఒంటరిగా ఉండే వృద్ధురాలి ఇంట్లో పనికి కుదురుతుంది. కానీ అక్కడికి కూడా షమ్నమ్ రావడం, వృద్ధురాలి కొడుకు విదేశాల నుంచి తిరిగిరావడంతో ఆ తల్లి జీవితం మళ్లీ ప్రమాదంలో పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? బాలన్ తన తల్లి కోసం ఎలా వెతికాడు? అనేదే మిగతా కథ.
కథనం, విశ్లేషణ ఎలా ఉందంటే?
ఒక నేరస్థురాలైన తల్లి తన గత నీడలు కొడుకు భవిష్యత్తుపై పడకూడదని పడే తపనను దర్శకుడు చిదంబరం ఎంతో మానవీయ కోణంలో ఆవిష్కరించారు. సాధారణ థ్రిల్లర్ అంశాల కంటే తల్లి కొడుకుల మధ్య ఉన్న బలమైన బంధంపైనే కథను నడిపించారు. సమాజం బాధితుల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో, వారిని ఎలా మూలన పడేస్తుందో ఇందులో చూపించారు.
సినిమా తొలిభాగం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, కథలోకి వెళ్లేకొద్దీ పాత్రలతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఎంతో భావోద్వేగంగా సాగి ఆకట్టుకుంటాయి. ఎక్కడా డ్రామా ఎక్కువ కాకుండా సస్పెన్స్, ఎమోషన్, మానవ సంబంధాలను సరిగ్గా బ్యాలెన్స్ చేశారు.
నటీనటుల పనితీరు
తల్లి పాత్రలో ఫర్జానా పలతింగల్ అద్భుతమైన నటనను కనబరిచారు. సంభాషణలు తక్కువగా ఉన్నప్పటికీ, తన కళ్లతోనే హావభావాలను పండించి మెప్పించారు. చిన్నారి బాలన్ పాత్రలో అధిశేషన్ కేఆర్ అమాయకత్వం, తల్లిపై ప్రేమాభిమానాలు ఆకట్టుకుంటాయి. బాలన్ చిన్ననాటి, టీనేజ్ పాత్రల ఎంపిక చాలా బాగుంది. టోవినో థామస్ ఒక ప్రత్యేకమైన క్యామియో రోల్‌లో కనిపించి మెప్పించగా, మిగిలిన నటీనటులు తమ పరిధి మేర బాగానే చేశారు.
సాంకేతిక విభాగం
దర్శకుడు చిదంబరం మరోసారి రియలిస్టిక్ మేకింగ్‌తో తన మార్కును చూపెట్టారు. షైజు ఖాలిద్ కెమెరా పనితనం అడవి ప్రాంతాలను, నిశ్శబ్ద వాతావరణాన్ని విజువల్‌గా చాలా అందంగా చూపించింది. సుషిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ఎమోషన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ పరంగా ప్రథమార్ధం కొద్దిగా కుదించి ఉంటే సినిమా ఇంకా వేగంగా ఉండేది.
చివరిగా.. ‘బాలన్: ది బాయ్’ ఫాస్ట్ పేస్డ్‌లో సాగే కమర్షియల్ సినిమా కాదు. ఒక మెచ్యూర్డ్ ఎమోషనల్ డ్రామా. నెమ్మదిగా సాగే కథనాలను, విభిన్నమైన మలయాళ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ఓటీటీ ఛాయిస్..




