Batchmates Web Series : ర్యాగింగ్, రచ్చ, రొమాన్స్.. 'బ్యాచ్‌మేట్స్' బీటెక్ లైఫ్ హిట్ అయిందా.?
Batchmates Web Series : హైదరాబాద్‌లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో, కొత్తగా కాలేజీలో అడుగుపెట్టిన కుర్రాళ్ల లైఫ్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నమే
batchmates
Batchmates Web Series : హైదరాబాద్‌లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో, కొత్తగా కాలేజీలో అడుగుపెట్టిన కుర్రాళ్ల లైఫ్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నమే ఈ 'బ్యాచ్‌మేట్స్' వెబ్ సిరీస్. ఇంటర్ పూర్తి చేసుకుని కలల ప్రపంచమైన బీటెక్‌లో జాయిన్ అయిన ముగ్గురు మిత్రుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సాదాసీదాగా సాగిపోయే వీరి కాలేజీ లైఫ్ లోకి ఒక 'గోల్డీ' అనే అమ్మాయి, అలాగే విలన్ లాంటి ఒక 'సీనియర్' వస్తే ఆ తర్వాత జరిగే రచ్చ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ చూడాల్సిందే.
సింపుల్ కథ.. కానీ ర్యాగింగ్ సెగ..!
సిద్ధార్థ్ (సాయి శ్రీరామ్), సామ్మి (సింధు రెడ్డి), మిల్కీ మహేష్ (ఆంథోని కార్తీక్) అనే ముగ్గురు స్నేహితులు ఒకే కాలేజీలో ఇంజనీరింగ్‌లో జాయిన్ అవుతారు. అక్కడ వారికి గోల్డీ అనే అమ్మాయి పరిచయమై వారి గ్యాంగ్‌లో చేరుతుంది. అయితే, అదే కాలేజీలో ఒక పెద్ద సార్ కొడుకు సీనియర్‌గా ఉంటూ జూనియర్లను ర్యాగింగ్ చేస్తుంటాడు. అమాయకంగా ఉన్న మిల్కీ యాదవ్ తెలియక ఆ సీనియర్ దగ్గరే కాస్త ఓవరాక్షన్ చేయడంతో, ఆ ముగ్గురి కాలేజీ జీవితం మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఆ సీనియర్ పెట్టిన టాస్క్‌లను వీరు ఎలా పూర్తి చేశారు? వారి స్నేహం నిలబడిందా లేదా అనేది మిగతా కథ.
స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే.?
మొత్తం నాలుగు ఎపిసోడ్లతో మొదలైన ఈ సిరీస్ నిడివి ఒక్కోటి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. పాయింట్ పరంగా ఇది చాలా సింపుల్ స్టోరీ. ముగ్గురు స్నేహితుల మధ్య సాగే కొన్ని రొటీన్ సీన్లు, కాలేజీ డ్రామాతో కథ సాగుతుంది. అయితే, యూత్‌ను ఆకట్టుకునే బలమైన 'స్పార్క్' లేదా ట్విస్టులు కథలో లేకపోవడం పెద్ద మైనస్. స్క్రీన్ ప్లే కూడా చాలా నెమ్మదిగా సాగడం వల్ల ప్రేక్షకులకు కొంత బోర్ కొట్టే అవకాశం ఉంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
ఈ సిరీస్‌లో నటించిన వారంతా దాదాపు కొత్త వారే. మిల్కీ మహేష్ పాత్రలో ఆంథోని కార్తీక్ చేసిన కామెడీ కొన్ని చోట్ల ఉపశమనం కలిగిస్తుంది. మెయిన్ లీడ్ నటుల విషయంలో దర్శకుడు క్యారెక్టర్ డిజైనింగ్ ఇంకాస్త స్ట్రాంగ్‌గా చేయాల్సింది. కొన్ని చోట్ల డబ్బింగ్, లిప్ సింకింగ్ సరిగా కుదరకపోవడం గమనార్హం. సీనియర్స్ - జూనియర్స్ మధ్య వచ్చే క్లాష్ సీన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
సాంకేతిక వర్గం పనితీరు
దర్శకుడు శ్రీ హర్ష శెట్టి ఒక ఫ్లాట్ కథను ఎంచుకోవడంతో దాన్ని గ్రిప్పింగ్‌గా నడిపించడంలో తడబడ్డారు. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించినా, సంగీతం , ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. స్లో సీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సిరీస్ కొన్ని చోట్ల ఇరిటేషన్ తెప్పిస్తుంది.
ఫైనల్ ముచ్చట..
ఫైనల్‌గా చెప్పాలంటే, 'బ్యాచ్‌మేట్స్' ఒక రెగ్యులర్ రొటీన్ కాలేజీ డ్రామా. కొత్తదనం కోరుకునే వారికి ఇది కాస్త నిరాశ కలిగించవచ్చు కానీ, టైమ్ పాస్ కోసం ఒకసారి అలా చూసేయొచ్చు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అయినా, కాలేజీ సీన్స్ ఇష్టపడే వారికి జస్ట్ ఓకే అనిపిస్తుంది.




