Dark OTT Review: ఆ ఇంటి రహస్యం ఏంటి? తెలుగులో ఓటీటీలోకి ‘డార్క్’.!

Dark OTT Review: ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్ డిజిటల్ వేదికపైకి వచ్చేసింది. తమిళంలో మంచి గుర్తింపు పొందిన సైకలాజికల్ హారర్ మూవీ 'డార్క్'

G Krishna
Published on: 24 Sept 2026 5:10 PM IST
Dark OTT Review
X

Dark OTT Review: ఆ ఇంటి రహస్యం ఏంటి? తెలుగులో ఓటీటీలోకి ‘డార్క్’.!

Dark OTT Review: ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్ డిజిటల్ వేదికపైకి వచ్చేసింది. తమిళంలో మంచి గుర్తింపు పొందిన సైకలాజికల్ హారర్ మూవీ 'డార్క్' (Dark) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. కె. జగన్ దర్శకత్వంలో అజయ్ కార్తీ, అంచనా నేత్రున్ ప్రధాన పాత్రల్లో నటించగా, సీనియర్ నటుడు భాగ్యరాజ్ అత్యంత కీలక పాత్రలో కనిపించారు.

థియేటర్ల విడుదల తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 'డార్క్' చిత్రం, తాజాగా తెలుగు వెర్షన్‌లోనూ అందుబాటులోకి వచ్చి హారర్ కథలను ఇష్టపడే వారి దృష్టిని ఆకర్షిస్తోంది.

తక్కువ అద్దె ఇల్లు.. అంతుచిక్కని భయంకర మరణాలు

కథ విషయానికి వస్తే, విఘ్నేశ్ (అజయ్ కార్తీ) తన మిత్రుడు చెప్పిన ఉద్యోగంలో చేరేందుకు చెన్నై నగరానికి చేరుకుంటాడు. తక్కువ బడ్జెట్‌లో అద్దె ఇల్లు కోసం వెతుకుతుండగా, కరుణాకర్ (భాగ్యరాజ్) అనే వ్యక్తికి చెందిన డాబా పైపోర్షన్ అతనికి లభిస్తుంది. కరుణాకర్ అత్యంత తక్కువ అద్దెకే ఆ పోర్షన్‌ను ఇవ్వడానికి అంగీకరిస్తాడు.

అయితే, గతంలో ఆ ఇంట్లో నివసించిన ముగ్గురు యువకుల మరణాల వెనుక ఉన్న భయంకరమైన నేపథ్యాన్ని అతనికి చెప్తాడు. ఆ ముగ్గురిలో ‘జీవా’ అనే కుర్రాడు సతీశ్, మోహన్‌లను దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడిస్తాడు. ఆ తదనంతరం వచ్చిన అద్దెదారులు కూడా అక్కడ దెయ్యాలు ఉన్నాయనే భయంతో ఇల్లు ఖాళీ చేసి పారిపోతారు.

విఘ్నేశ్ అక్కడ నివసిస్తే ఆ దెయ్యాల పుకార్లకు తెరపడుతుందని, తద్వారా ఆ ఇంటిని అమ్మేసి సొంత ఊరికి వెళ్లిపోవచ్చని కరుణాకర్ భావిస్తాడు. తక్కువ అద్దె లభించడంతో విఘ్నేశ్ ఎలాంటి భయం లేకుండా ఆ ఇంట్లోకి అడుగుపెడతాడు.

రాత్రి వేళ విచిత్ర అనుభవాలు.. సైకలాజికల్ ఫీలింగా? నిజమైన దెయ్యమా?

ఆ ఇంట్లో కరుణాకర్ కూతురు ప్రియదర్శి కూడా నివసిస్తుంటుంది. అయితే ఆమె నిరంతరం తీవ్ర నిరాశతో, దిగులుగా కనిపించడం, ఆమె విషయమై కరుణాకర్ ఎలాంటి విశేషాలు చెప్పకపోవడం విఘ్నేశ్‌కు అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఇంట్లోకి దిగిన మొదటి రోజు నుంచే విఘ్నేశ్‌కు అర్ధరాత్రి వేళల్లో భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

విద్యుత్ కనెక్షన్ తీసేసినా టీవీ దానంతట అదే ఆన్ కావడం, దోశలు వేసే ప్యాన్, పుస్తకాలు గాల్లోకి లేచి వచ్చి పడటం వంటి వింత పరిణామాలు చోటుచేసుకుంటాయి. వాటిని నాశనం చేసినా లేదా పూడ్చిపెట్టినా మళ్లీ యథాతథంగా జరగడంతో అసలేం జరుగుతుందో అర్థం కాక విఘ్నేశ్ తీవ్ర అయోమయానికి గురవుతాడు.

అసలు ఆ ముగ్గురు మిత్రులు ఎందుకు ప్రాణాలు కోల్పోయారు? ఆ ఇంట్లో నిజంగానే దెయ్యాలు సంచరిస్తున్నాయా లేదా ఇదంతా విఘ్నేశ్ మానసిక భ్రమా? ఈ భయానక పరిస్థితుల నుంచి అతను ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అనేది ‘డార్క్’ చిత్ర మిగతా కథ.

ప్రయోగంగా సాగిన కథనం.. ప్రేక్షకులను ఆకట్టుకుందా?

పాత ఇల్లు, అక్కడ ఆత్మల సంచారం, భయపెట్టే వాతావరణం అనేది హారర్ చిత్రాల్లో సాధారణంగా కనిపించే కథాంశమే. 'డార్క్' సినిమాలో కూడా ఆత్మలుగా మారిన వారు ఎవరు, వారి వెనుక ఉన్న నేపథ్యం ఏమిటనే అంశమే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. దర్శకుడు దెయ్యాన్ని నేరుగా తెరపై చూపించకుండా, హీరో అనుభవించే భయం ద్వారానే ప్రేక్షకులను భయపెట్టే ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. అయితే, కథనంలో కావలసినంత పట్టు లేకపోవడం , ట్విస్టులు ముందే ఊహించేలా ఉండటంతో ఉత్కంఠత తగ్గుతుంది.

హారర్ సినిమాలకు ప్రాణమైన భయానక నేపథ్య సంగీతం, లైటింగ్ ఎఫెక్ట్స్ కంటే సహజత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హారర్ ఫీల్ కాస్త తగ్గినట్లనిపిస్తుంది. నాలుగు గోడల మధ్య సాగే ఈ కథనంలో స్పష్టత కొరవడటంతో 'డార్క్' చిత్రం హారర్ ప్రియులకు ఒక సగటు అనుభూతిని మాత్రమే అందిస్తుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.