Declassified Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అసలు కథ.. బయటపెట్టిన సైనిక అధికారులు..
Declassified Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సాయుధ దళాలు చేపట్టిన వ్యూహాత్మక సైనిక చర్యను కళ్లకు కట్టినట్లు చూపే నూతన డాక్యుసిరీస్.
Declassified Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అసలు కథ.. బయటపెట్టిన సైనిక అధికారులు..
Declassified Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సాయుధ దళాలు చేపట్టిన వ్యూహాత్మక సైనిక చర్యను కళ్లకు కట్టినట్లు చూపే నూతన డాక్యుసిరీస్ 'డిక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్' (సీజన్ 1). 88 గంటల పాటు సాగిన ఈ రక్షణ చర్యల వెనుక ఉన్న ప్రణాళికలు, క్లిష్టమైన నిర్ణయాలు , సైనిక దళాల పోరాట పటిమను ఈ డాక్యుసిరీస్ సవివరంగా విశ్లేషిస్తుంది.
కథాంశం.. పహల్గామ్ దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు
ఏప్రిల్ 22, 2025న పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో చోటుచేసుకున్న దారుణ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని కలిగించింది. దీనికి సముచిత సమాధానం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం, త్రివిధ దళాలు కలసి సంయుక్తంగా ప్రణాళిక రచించిన ప్రతిస్పందనే 'ఆపరేషన్ సింధూర్'. మే 7 నుంచి మే 10, 2025 మధ్య కాలంలో 88 గంటల పాటు సాగిన ఈ మిలిటరీ ఆపరేషన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామకరణం చేశారు. ఉగ్రవాద మౌలిక వసతులపై భారత్ చేపట్టిన ఖచ్చితత్వంతో కూడిన దాడులు, ఆ సమయంలో జరిగిన అత్యున్నత స్థాయి వ్యూహాత్మక చర్చలను ఈ రెండు భాగాల డాక్యుసిరీస్ వివరిస్తుంది.
కీలక అధికారులు , జాతీయ భద్రతా నాయకత్వం
మనిక బెర్రీ అస్గాంకర్, ప్రభు అస్గాంకర్ ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ప్రధాన బలం ప్రత్యక్షంగా పాల్గొన్న అగ్ర సైనిక అధికారుల వ్యాఖ్యలు. ఇందులో మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్ , లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఆపరేషన్ సమయంలో ఎదురైన రక్షణపరమైన సవాళ్లను నేరుగా వివరించారు. అంతేకాకుండా ఆపరేషన్ ముగిసిన తర్వాత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ ఇచ్చిన తొలి ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ డాక్యుసిరీస్‌లో అత్యంత కీలక ఘట్టంగా నిలిచింది. బ్రహ్మోస్ క్షిపణుల సమర్థవంతమైన వినియోగం, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ల మధ్య కుదిరిన అద్భుత సమన్వయం, ఆర్కైవల్ ఫుటేజ్ , నిజమైన ఆపరేషనల్ వీడియోలు ఈ కథనానికి అదనపు విశ్వసనీయతను తెచ్చిపెట్టాయి.
డాక్యుసిరీస్ విశ్లేషణ.. బలాలు , పరిమితులు
ఈ సిరీస్ ప్రధాన బలం ఏమిటంటే ఘటనల వరుస క్రమాన్ని ప్రత్యక్షంగా పాల్గొన్న అధికారుల మాటల్లోనే చెప్పించడం వీక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది. సైనిక వ్యూహాలు, సునిశిత దాడుల వెనుక ఉన్న సాంకేతిక నైపుణ్యం , దౌత్యపరమైన అంశాలను సమగ్రంగా చర్చించారు. "యుద్ధం ప్రారంభించడం సులభం, కానీ ముగించడం కష్టం" అనే సందేశం ద్వారా సైనిక బలం అనేది కేవలం ఆయుధాల వినియోగంలోనే కాక, వ్యూహాత్మక నిగ్రహంలో కూడా ఉంటుందని ఇందులో చక్కగా చూపించారు. అయితే కొన్ని చోట్ల విశ్లేషణాత్మక లోతు కంటే అధికారిక ఇంటర్వ్యూలు, రాజకీయ ప్రసంగాలే ఎక్కువగా కనిపించడం వల్ల డాక్యుసిరీస్ స్వతంత్ర పరిశీలన కంటే ఒక అధికారిక నివేదికలా తోస్తుంది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావంపై మరిన్ని కోణాలను స్పృశించి ఉంటే ఇంకా బాగుండేది.
మొత్తానికి 'డిక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్' అనేది భారత సైనిక చరిత్రలోని ఒక కీలక ఘట్టాన్ని కళ్లకు కట్టే ప్రతిష్టాత్మక డాక్యుసిరీస్. ప్రతికూల పరిస్థితుల్లో త్రివిధ దళాల సమన్వయాన్ని, సైనిక సన్నద్ధతను ప్రత్యక్ష సాక్ష్యాలతో వివరించిన ఈ నిర్మాణం మిలిటరీ థ్రిల్లర్లు, చరిత్రను ఆసక్తిగా గమనించే ప్రతి ఒక్కరూ చూడదగినదిగా నిలుస్తుంది.




